ఏలూరు ఫైర్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు (ఫైల్)
ఏలూరు (టూటౌన్): ట్రాయ్ నిబంధనలు, జీఎస్టీ పేరుతో ప్రజలపై పడుతున్న కేబుల్ చార్జీలను ఉపసంహరించాలని కోరుతూ జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేసిన ఆపరేటర్లు మరోసారి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నుంచి ట్రాయ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు మండిపడుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా చిన్న చిన్న కేబుల్ ఆపరేటర్లను కొట్టి బడా కంపెనీలకు దోచి పెట్టేవిధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
సర్వత్రా నిరసన
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ నిబంధనలు ఉపసంహరించుకునేలా చేయాలని వీరు కోరుతున్నారు. ఇప్పటికే సినిమాలు భారమై సగటు ప్రజలు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా తాజా చర్యలు మూలంగా బుల్లి తెర వినోదం సైతం ప్రజలకు భారంగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ట్రాయ్ నిబంధనల మేరకు మీరు చూస్తున్న చానళ్లకే రేట్లు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ దాని వెనుక కేబుల్ రంగంలో కూడా బడా కంపెనీలకే దోచిపెట్టే కుట్ర దాగి ఉందని ఆపరేటర్లు విమర్శిస్తున్నారు.
స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ప్రసారాలు
జిల్లాలో కేబుల్ ప్రసారాలను స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారానే జరుగుతోంది. చాలా మంది ఆపరేటర్లు సొంత పెట్టుబడులు పెట్టుకుని దీన్నే స్వయం ఉపాధి మార్గంగా తాము బతుకుతూ తమతో పాటు మరి కొందరికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.200 నుంచి రూ.250, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.150 నుంచి రూ.200 వరకూ వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా ట్రాయ్ నిబంధనల మేరకు ఒక్కో వినియోగదారుడు నెలకు కచ్చితంగా జీఎస్టీతో కలిపి రూ.153.40 చెల్లించాల్సి ఉంది. దీనిలో వచ్చే చానల్స్‌లో దూరదర్శన్ తో పాటు మిగతా అన్నీ పరభాషా చానెల్సే ఉంటాయి.
మనకు నచ్చిన తెలుగు చానల్స్‌ను ఎంచుకోవాలంటూ ఒక్కో చానెల్‌కు ఒక్కో రేటును వినియోగదారుడు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన కనీసం ఒక్కో వినియోగదారుడు కనీసం రూ.100 వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ కారణంగా ప్రజలు కేబుల్ ప్రసారాలను పక్కన బెట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే జిల్లాలోని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. జిల్లా వ్యాప్తంగా కేబుల్ ప్రసారాలను అందించే ఎంఎస్‌ఓలు 11 మంది ఉన్నారు. ఏలూరు,నిడదవోలు, పెనుగొండ, జంగారెడ్డిగూడెం, మొగల్తూరు,పాలకొల్లు, భీమవరం, తణుకు,తాడేపల్లిగూడెం, కొవ్వూరు,నల్లజర్ల కేంద్రాల నుంచి జిల్లా అంతటా కేబుల్ ప్రసారాలు జరుగుతున్నాయి.
కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సి వస్తుంది
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ట్రాయ్ నిబంధనలను అమలు చేస్తే కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న కేబుల్ చార్జీలను చెల్లించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీస చార్జీలు, జీఎస్టీ, అదనపు చానెళ్ల చార్జీల రూపంలో అదనంగా సొమ్ము చెల్లించాలనడం సరైంది కాదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.– ఎస్.జగదీష్, అధ్యక్షులు, ఏలూరు నగర కేబుల్ ఆపరేటర్ల సంఘం
జీఎస్టీ ఎత్తివేయాలి
సామాన్య పేద ప్రజలు వినోదం కోసం ఆశ్రయించే కేబుల్ ప్రసారాలపై జీఎస్టీ విధించడం అన్యాయం. పాలకులు దీన్ని కూడా ఆదాయ వనరుగా చూడటం బాధాకరం. ఒకపక్క పాలకులు పేదల సంక్షేమానికి ఎంతో చేస్తున్నామంటూ దొడ్డిదారిన ఈవిధంగా భారం మోపడం తగదు. దీనిని రద్దు చేయాలి.– వి.భోగేశ్వరి, హనుమాన్ నగర్,వెంకటాపురం, ఏలూరు రూరల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment