ట్రాయ్‌ నిబంధనలు ఏకపక్షం!  | Cable Operators Protest Against TRAI Over Various Demands | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Cable Operators Protest Against TRAI Over Various Demands - Sakshi

గురువారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద ధర్నా చేస్తున్న కేబుల్‌ ఆపరేటర్లు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన ట్రాయ్‌ నిబంధనలపై రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్‌వోలు, ఎల్‌సీవో కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడింది. తమ అభిప్రాయాలను తీసుకోకుండానే టారిఫ్‌ ఆర్డర్‌ను తీసుకురావడం ఆక్షేపణీయమని పేర్కొంది. కేబుల్‌ టీవీ వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా.. ట్రాయ్‌ నిర్దేశించిన టారిఫ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయాలన్న డిమాండ్‌తో తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్‌వో, ఎల్‌సీఓ కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ‘కేబుల్‌ ఆపరేటర్ల మహాధర్నా’జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆపరేటర్లు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు.

టారిఫ్‌ ఆర్డర్‌లో మార్పులు తేవడం, పే చానళ్ల ధరను ఐదు రూపాయలకు మించకుండా చూడడంతోపాటు జీఎస్టీని 18 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 29న (శనివారం) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పది గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తా చానళ్లు మినహాయించి పే టీవీ బ్రాడ్‌కాస్టర్స్‌కు సంబంధించిన పే చానళ్ల ప్రసారాలు నిలిపివేయా లని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ దిశగా తెలుగురాష్ట్రాల్లోని కేబుల్‌ ఆపరేటర్లందరికీ చానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ పిలుపునిచ్చింది. 

కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి 
కేబుల్‌ ఆపరేటర్లను సంప్రదించకుండా ట్రాయ్, కేంద్ర ప్రభుత్వం టారిఫ్‌ ఆర్డర్‌ను తీసుకురావడంపై ఎమ్మెస్‌వోలు, ఎల్‌సీవోలు తీవ్రంగా మండిపడ్డారు. ట్రాయ్‌ డైరెక్టర్‌గా ఒక కేబుల్‌ ఆపరేటర్‌ను నియమించాలని వీరు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కేబుల్‌ టీవీపై లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. టారిఫ్‌ ఆర్డర్‌పై గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకు, వినియోగదారులకు అవగాహన కూడా లేదని వాపోయారు. కార్పొరేట్‌ శక్తులకు లబ్ధిచేకూర్చేందుకే.. కేంద్ర ప్రభుత్వం కేబుల్‌ టీవీ రేట్లను పెంచిందని వారు విమర్శించారు. పేద ప్రజల అభీష్టానికి అనుగుణంగా రేట్లు నిర్ణయించాలన్నారు. ట్రాయ్, బ్రాడ్‌కాస్టర్లు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిలో కేబుల్‌ ఆపరేటర్లు కలిసికట్టుగా పోరాటం చేయకపోతే వీరి మనుగడే కష్టమవుతుందన్నారు. జీఎస్‌టీ, పోల్‌టాక్స్‌లపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ముఠాగోపాల్‌లు మాట్లాడుతూ కేంద్రం తీరువల్లే కోట్ల మంది కేబుల్‌ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేబుల్‌టీవీ ఆపరేటర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీ నాయకులు కనకాల శ్యాం కురుమ, విక్రమ్‌ గౌడ్, కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సంఘాల జేఏసీ నాయకులు కిశోర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు హరిగౌడ్‌లు పాల్గొన్నారు. 

అధికార, విపక్షాల సంఘీభావం 
ఎమ్మెస్‌వోలు, కేబుల్‌ టీవీ ఆపరేటర్ల జేఏసీ మహాధర్నాకు.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ రెడ్డి, ముఠా గోపాల్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ కేబుల్‌ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు మిద్దెల జితేందర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.రాజుగౌడ్, ఏపీ, తెలంగాణ ఆపరేటర్ల సమన్వయకర్త పమ్మి సురేష్, తెలంగాణ మల్టీ సర్వీస్‌ కేబుల్‌ టీవీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ యాదవ్, తెలంగాణ ఎమ్మెస్‌వోల అధ్యక్షుడు ఎం.సుభాష్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్‌ కేబుల్‌ టీవీ ఫెడరేషన్‌ అధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, ఏపీ కేబుల్‌ టీవీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఇప్పటి వరకు ఒక రూపాయి ఉన్న పే చానళ్లు ట్రాయ్‌ తాజా నిబంధనలతో ఏకంగా రూ.19 పెంచుతున్నాయని.. దీని వల్ల ప్రస్తుతం నెలవారీగా వసూలు చేస్తున్న కేబుల్‌ అద్దె రూ.180 నుంచి రూ.800కు పెరుగుతుందని వెల్లడించారు. ఒక్క తెలుగు పే చానల్స్‌కే నెలకు దాదాపు రూ.300 భారం పడుతుందని అన్నారు. చానళ్ల ధరల పెరుగుదల వినియోగదారులకు, ఎమ్మెస్‌వోలు, ఎల్‌సీఓలకు తీవ్ర భారమవుతుందని అన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement