వ్యాయామోపాధ్యాయుడి వికృత చేష్టలు
- పాఠశాలను ముట్టడించిన బాలికల తల్లిదండ్రులు
- చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ వరలక్ష్మి విచారణ
కొత్తవలస(పాచిపెంట): ‘మా హైస్కూల్ వ్యాయామోపాధ్యాయుడు రాజశేఖర్ ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. కానీ కనీసం మూడు సార్లయినా వ్యాయామ విద్యను బోధించలేదు. మమ్మల్ని నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడు. మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లు మౌనంగా భరించాం’.. అని కొత్తవలస జెడ్పీ హైస్కూల్ బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వ్యాయామోపాధ్యాయుడు రాజశేఖర్ తీరుపై తల్లిదండ్రులు, గ్రామస్తులు కొత్తవలస జెడ్పీ హైస్కూల్‌ను గురువారం ముట్టడించారు. పాచిపెంట కు చెందిన బి.రాజశేఖర్ కొన్నాళ్లుగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు విజయనగరంలోని చైల్డ్‌లైన్ సెంటర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఏరియా కో-ఆర్డినేటర్ వరలక్ష్మి, మధుసూదనరావు హూటాహుటిన పాఠశాలకు చేరుకొని 16 మంది పదో తరగతి విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించారు.
గ్రామ పెద్దలు మతల బలరాం, మాదిరెడ్డి మజ్జారావు, దత్తి పైడిపు నాయుడు, అసరవిల్లి అప్పలనాయుడు, రేగు సత్యనారాయణ, బొంగు అప్పలనాయుడు సహా సుమారు వందమంది గ్రామస్తులు చైల్డ్‌లైన్ కో-ఆర్ఢినేటర్ వరలక్ష్మికి పాఠశాల పరిస్థితిని వివరించారు. ఈ విషయాన్ని పై అధికారులకు నివేదించనున్నట్టు వరలక్ష్మి విలేకరులకు తెలిపారు. లైంగిక వేధింపులపై పీఈటీ రాజశేఖర్‌ను విలేకరులు వివరణ కోరగా గ్రామస్తుల ఆరోపణలు అవాస్తవమన్నారు.