callcentres
-
నకిలీ కాల్ సెంటర్ కేసులో గూగుల్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కంపెనీల సర్వీస్ సెంటర్ పేరుతో రెండేళ్ల పాటు నకిలీ కాల్ సెంటర్ నడిపిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ సంస్థకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. 30 మంది టెలీకాలర్లతో రామంతాపూర్ కేంద్రంగా ఈ సెంటర్ నడిపిన మహ్మద్ సలీమ్, మహ్మద్ అరీఫ్‌లను గత వారం పట్టుకున్న విషయం విదితమే. వీరు గూగుల్‌నే కేంద్రంగా చేసుకుని ఈ దందా కొనసాగించారు. గూగుల్‌లో యాడ్ స్పేస్ కొనడంతో మొదలుపెట్టి కృత్రిమ హిట్స్, క్లిక్ ద్వారా అవి సెర్చ్‌లో మొదట కనిపించేలా చూశారు. దీనికి తోడు ఆయా సంస్థలకు చెందిన సర్వీసింగ్ సెంటర్ల చిరునామాలు ఒక చోట ఉండగా... గూగుల్ మ్యాప్‌లో వాటి స్థానాలను మార్చేసి కస్టమర్లలో గందరగోళం సృష్టించారు. ఇలా తమ నకిలీ కాల్ సెంటర్ వైపే వాళ్లు మొగ్గేలా చేసి వ్యాపారం పెంచుకున్నారు. కస్టమర్ల నుంచి అసలు రేట్లకు 30 నుంచి 40 శాతం అదనంగా వసూలు చేశారు. ఈ డబ్బులో 60 శాతం వీరు తీసుకుని స్థానికంగా సేవలు వినియోగించుకున్న టెక్నీషియన్‌కు 40 శాతం చొప్పున ఇచ్చారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్‌లోని యాడ్ స్పేస్ నిర్వహణ చేసే ఉద్యోగులు, సాంకేతిక నిపుణులను విచారించాలని నిర్ణయించారు. ప్రధానంగా గూగుల్ మ్యాప్స్‌లో వీళ్లు లోకేషన్స్‌ను ఎలా మార్చగలిగారన్న అంశంపై ఆరా తీయనున్నారు. మరోపక్క తదుపరి విచారణ నిమిత్తం నిందితులు ఇద్దరినీ తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: తప్పని పడిగాపులు ) -
టార్చర్ ఫ్రమ్ హోమ్!
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్ యాప్స్ తరపున పని చేస్తూ రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వారిని వివిధ రకాలుగా వేధిస్తున్న కాల్ సెంటర్లు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్గావ్లో చేసిన దాడుల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం నగరానికి తరలించారు. చైనీయులు సూత్రధారులుగా ఏర్పాటైన సంస్థలు క్యాష్ అడ్వాన్స్, మనీ బాక్స్, అడ్వాన్స్ క్యాష్, లోన్ బజార్, క్యాష్ బస్ పేర్లతో లోన్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకున్న అనేక మంది రుణం తీసుకుంటున్నారు. వడ్డీ, సర్వీస్ చార్జీల భారం నేపథ్యంలో చెల్లించలేకపోయిన వారి నుంచి వసూలు చేయడానికి గుర్గావ్ కేంద్రంగా కాల్‌సెంటర్ ఏర్పాటైంది. అదే ప్రాంతానికి చెందిన హరిప్రీత్ సింగ్, పంకజ్‌ల నేతృత్వంలో ఇది నడుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీలోని లోన్ యాప్స్ కాల్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. దీంతో అప్పటి నుంచి వీరు తమ పంథా మార్చారు. గుర్గావ్లోని కాల్ సెంటర్‌ను మూసేశారు. తమ దందా కొనసాగించడం కోసం కొందరిని టీమ్ లీడర్లుగా ఎంపిక చేసుకుని వారి కింద 12 మందిని టెలీ కాలర్లుగా నియమించారు. ఇలా 15 బృందాలను ఏర్పాటు చేసిన హరి, పంకజ్‌లు టెలీకాలర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. టీమ్ లీడర్లు అందించే రుణగ్రస్తుల జాబితాల ఆధారంగా టెలీకాలర్లు వారి ఇంటి నుంచే ఫోన్లు చేసి, మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధించేలా చేస్తున్నారు. క్యాష్ అడ్వాన్స్ యాప్ నుంచి రుణం తీసుకుని వేధింపులు ఎదుర్కొన్న బాధితుడి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరిలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీనిని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు గుర్గావ్, ఢిల్లీల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో దాడులు చేసి గుర్గావ్లో టీమ్ లీడర్‌గా పని చేస్తున్న బీహార్ వాసి వికాస్ కుమార్, ఢిల్లీ, గుర్గావ్లకు చెందిన టెలీకాలర్లు శ్వేత, రాహుల్ రాణాలను అరెస్టు చేశారు. వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి మంగళవారం సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. హరిప్రీత్ సింగ్, పంకజ్‌లతో పాటు మరో ఇద్దరు టీమ్ లీడర్లు అయిన దీపక్, సుమంత్‌లను ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కేసులోనూ వీరు నిందితులు కావడంతో కోర్టు అనుమతితో ఇక్కడకు తరలించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. (చదవండి: యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఆర్టీసీ...నడిరోడ్డే బస్‌బేలుగా..) -
ఇసుక సమస్యకు కాల్ సెంటర్ : కలెక్టర్
సాక్షి, విజయవాడ : ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదివారం వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్ వెల్లడించారు. మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ప్రకటించారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ ఆకస్మిక తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఎంఎం నాయక్ ఐదు జిల్లాలకు సేవలందిస్తున్న విశాఖలోని సెంట్రలైజ్డ్ కస్టమర్ కాల్‌సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.సంస్థ పరి«ధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వినియోగదారుల నుంచి వస్తున్న విద్యుత్ సమస్యలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు ఏ విధంగా రోజుకి ఎన్ని స్వీకరించి వాటిని ఎంత సమయంలో సంబంధిత సెక్షన్ కార్యాలయానికి చేరవేస్తున్నారు,అక్కడి వారు ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తున్నారనే అంశాలను సీఎండీ పరిశీలించారు. శుక్రవారం ఫిర్యాదు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినియోగదారుడికి సీఎండీ స్వయంగా ఫోన్‌చేశారు. సమస్య పరిష్కరించారా లేదా అని అడిగితెలుసుకున్నారు. పరిష్కారమయ్యిందని వినియోగదారుడు సమాధానమిచ్చారు. సీఎండీ స్వయంగా తనతో మాట్లాడటంతో వినియోగదారుడు ధన్యవాదాలు తెలిపారు. కాల్‌సెంటర్‌ను మరింత పటిష్టం చేసి, సెక్షన్ కార్యాలయాలతో సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఏడీఈ స్థాయి అధికారిని నియమించాలని ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సి.శ్రీనివాసమూర్తిని సీఎండీ నాయక్ ఆదేశించారు.సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లోని వినియోగదారులు విద్యుత్ సమస్యలను 1912కు ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కాల్‌సెంటర్‌కు తెలియజేసేలా వారిలో అవగాహన కల్పించాలని అధికారులకు, పట్టణ ప్రాంత వినియోగదారులకు ఫిర్యాదు చేసిన 4గంటల్లోనూ, గ్రామీణ ప్రాంతం వారు 12 గంటల్లోపు పరిష్కారం పొందవచ్చనే నమ్మకాన్ని కల్పించాలని కాల్‌సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నాయక్ చేసిన కార్యక్రమం వినియోగదారుల సేవలకు సంబంధించింది కావడంతో ఆయన ప్రధాన్యతలేమిటో స్పష్టమైంది.