ఆ ఐదేళ్లూ అరాచకమే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అరాచకాలకు కేంద్ర బిందువుగా ఉండేది. ఆ పార్టీ నాయకులు చేసిన దుర్మార్గాలు అంతు లేకుండా పోయాయి. 2014 నుంచి 19 వరకూ చోటుచేసుకున్న ఘటనలు తలుచుకుంటేనే తూర్పు నియోజకవర్గ ప్రజలు భయపడిపోతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ మూలాలు తూర్పులోనే మొదలయ్యాయి. టీడీపీ నాయకులు నియోజకవర్గాన్ని పేకాట డెన్‌గా మార్చారు. నివాస ప్రాంతాల్లోనే పేకాట శిబిరాలు నిర్వహించారు. అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. బెల్ట్ షాపులతో పాటు, దందా లు ఎక్కువగా ఉండేవని ప్రజలు అంటున్నారు. కార్పొరేటర్ల అరాచకాలు సైతం మామూలుగా ఉండేవి కాదని జనం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజుల్ని తలచుకుంటేనే గజగజలాడిపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
టీడీపీ ప్రభుత్వంలో 2015లో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలను లైంగికంగా వేధించడంపై పటమట, మాచవరం పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో తూర్పు నియోజకవర్గంలోని పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. వారంతా కేవలం పాత్రదారులేనని, అసలు సూత్రదారులు నాటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరనేది కూడా తూర్పు ప్రజలందరికీ తెలుసు. తమ అధికారం ఉపయోగించి వారి పేర్లు బయటకు రాకుండా చూసుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మహిళలను లైంగిక అవసరాలకు వాడుకున్న వారిలో వారు కూడా ఉన్నారని తూర్పు ప్రజలు ఇప్పటికే చెబుతున్నారు. అలాంటి వారు నేడు శాంతియుతం అంటూ ప్రచారం చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు.
దొంగలుగా మారిన తెలుగు తమ్ముళ్లు..
గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దొంగతనం కేసులో తెలుగు తమ్ముళ్లు నిందితులుగా అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ ఎమ్మెల్యే గద్దెకు అత్యంత అనుచరులు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 18వ డివిజన్ టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసిన పీరుబాబు, 22వ డివిజన్ టీడీపీ నేత పెద్ది అన్నారావులు బృందావనకాలనీలోని ఓ ఇంట్లో దొంగిలించిన వెండి వస్తువులను దొంగలతో కలిసి అమ్మకాలు చేపట్టగా కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు.
పేకాటకు డెన్‌గా..
నాడు రామలింగేశ్వరనగర్, పటమటలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్‌గా పేకాట శిబిరాలు నిర్వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా ఉండే ఇద్దరు, ముగ్గురు ఈ శిబిరాలు నిర్వహించే వారని ప్రజలు చెబుతున్నారు. పేకాట శిబిరాలు నిర్వహణ, పేకాట ఆడేవారంతా టీడీపీకి చెందిన వారే ఉండేవారు. అంతేకాదు గంజాయి, బెల్ట్‌షాపులు సైతం ఎక్కడ చూసినా దర్శనం ఇచ్చేవి. పటమటలంకలో ఓ కార్పొరేటర్ బంధువు బెల్ట్‌షాపు నడిపేవాడు. యువతను గంజాయికి బానిసలుగా మార్చింది సైతం ఆ సమయంలోనేనని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతుండేవారని గుర్తు చేసుకుంటున్నారు. అరాచకాలకు కేరాఫ్‌గా ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు అల్లర్లు అంటూ ప్రచారం చేస్తుండటంతో తూర్పు ప్రజలు నవ్వుకుంటున్నారు.