అలరించిన ఆర్తి, అర్చనల గానామృతం
తిరుపతి కల్చరల్: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి త్యాగరాజ మండపంలో కవలలైన ఆర్తి, అర్చనల గానామృతం కమనీయంగా సాగింది. సద్గురు శ్రీత్యాగరాజస్వామి 250వ జయంతి సందర్భంగా త్యాగరాజు ఉత్సవ కమిటీ74వ వార్షిక సంగీతోత్సవాలు సోమవారంతో 8వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రులైన కవలలు శాస్త్రీయ కర్ణాటక సంగీతంతో శ్రోతల హృదయాలను రంజింపజేశారు. శ్రీరాగంలో వందే వాసుదేవం, విజయశ్రీ రాగంలో వరనారద నారాయణ., భైరవి రాగంలో తనయుని బ్రోబ జనని వచ్చునో వంటి అపూర్వ కృతులను ఆలపించి ప్రేక్షకుల హర్ష««ధ్వానాలు అందుకున్నారు. వీరికి వయోలిన్‌పై రాజీవ్, మృందంగంపై ప్రవీణ్ చక్కటి సహకారం అందించారు. అనంతరం చెన్నైకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, సప్తగిరి సంగీత విద్వన్మణి అరుణాసాయిరామ్ గాత్ర కచేరి సాగింది. తోడిరాగంలో కద్దను వారికి కద్దు కద్దు.., హిరణ్మయి లక్ష్మీ లలిత వంటి అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, వనానందకరంగా ఆలపించి ప్రేక్షులను మైమరిపించారు. వీరికి వయోలిన్‌పై ఎంఏ.కృష్ణస్వామి, మృదంగంపై వైద్యనాథన్, ఘటంపై మురళి సహకారం అందించారు. ఈ సందర్భంగా సంగీత విద్యాంసులను త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భీమాస్ రఘు, కంచి రఘురామ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోహనసుందరం, ప్రభాకర్, వేణుగోపాల్‌రెడ్డి, దొరైరాజ్ పాల్గొన్నారు.