మీడియాపై బౌన్సర్ల దాడి.. పవన్ క్షమాపణలు
హైదరాబాద్: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్ర సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా పవన్‌కళ్యాణ్‌కు మంత్రులు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్‌ను మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిత్రయూనిట్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. దీంతో పవన్ బౌన్సర్ల దాడిని ఖండిస్తూ వీడియో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. బౌన్సర్లు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెబుతున్నా: పవన్
సాధారణంగా మీడియాకు ఇబ్బంది కలిగే పరిస్థితిని తాను కల్పించనని, అయితే అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి మంత్రులు వచ్చిన సందర్భంగా మీడియా సిబ్బందిపై జరిగిన దాడికి క్షమాపణలు చెబుతున్నానని సినీహీరో పవన్ కల్యాణ్ చెప్పారు. సాధారణంగా ఎవరో ఒకరు తమ షూటింగు ప్రాంతంలోకి వచ్చేస్తుంటారని, కొంతమంది కెమెరాలతో కూడా వస్తుంటే వాళ్లను తమ సిబ్బంది అడ్డుకుంటారని, వచ్చింది మీడియా అని తెలియకపోవడంతో ఇలా చేసి ఉంటారని పవన్ అన్నారు. దెబ్బలు తగిలిన వాళ్లకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నారు. దాడి చేసిన వాళ్లు ఎవరో గుర్తించి వారికి సరైన పనిష్మెంట్ కూడా ఇస్తానని తెలిపారు.