చల్లారిన జమ్ము
జమ్ము: గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న జమ్ము శనివారంనాటికి కాస్త చల్లబడింది. నేటి ఉదయం సిక్కు మతపెద్దలు, ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సాధారణ పరిస్థితులకు మార్గం సుగమమైంది. అయితే శనివారం కూడా పాఠశాలలు, కళాశాలలు మూసే ఉంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆందోళనలకు అసలు కారణమైన ఖలిస్తాన్ మిలిటెంట్ నేత బింద్రన్ వాలే పోస్టర్లను తొలిగించిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని, సిక్కు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ఆర్ కే గోయల్, కశ్మీర్ డీజీపీ కే. రాజేంద్ర కుమార్ తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందం సిక్కులకు హామీ ఇచ్చింది. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని, తమ డిమాండ్లు అంగీకరించినందున ఆందోళనలకు స్వస్తిచెబుతున్నామని సిక్కుల నాయకుడు తర్లోచన్ సింగ్ మీడియాకు చెప్పారు. పోలీసు వద్దనుంచి లాక్కున్న ఏకే 47 తుపాకిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.