Cameron Diaz
-
హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు!
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్లో ఆల్‌టైమ్ అత్యధిక సంపాదనాపరులు జాబితాలో తన పేరు ఒక్కటే ఉండడం పట్ల హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత మంది హీరోయిన్లు పేర్లు ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. హాలీవుడ్లో అత్యధిక సంపాదన కలిగిన నటీమణిగా ఆమె ఘనత సాధించింది. అత్యధిక సంపాదన కలిగిన హీరోహీరోయిన్ల పేర్లతో బాక్సాఫీస్ మొజో వెబ్సైట్ ఇటీవల రూపొందించిన టాప్-10 జాబితాలో స్కార్లెట్ జాన్సన్‌కు మాత్రమే స్థానం దక్కింది. 3.3 బిలియన్ డాలర్ల సంపాదన(దాదాపు రూ. 22245 కోట్లు)తో ఆమె 10వ స్థానంలో నిలిచింది. టాప్-10లో చోటు దక్కించుకున్న మహిళ ఆమె ఒక్కరే కావడం విశేషం. దీనిపై 'ఎక్స్ ట్రా టీవీ' షోలో ఆమె స్పందించింది. 'హయ్యస్ట్ ఎర్నింగ్ నటీనటుల జాబితాలో నాకు చోటు దక్కడం ఉత్సాహకరంగానే ఉంది. ఈ లిస్ట్‌లో ఒక్క మహిళకే స్థానం దక్కడం అసంతృప్తి కలిగించింది. ఇది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింద'ని స్కార్లెట్ జాన్సన్ పేర్కొంది. మరో నటీమని కామెరాన్ డియాజ్ 19వ స్థానంలో నిలిచింది. -
ఉంగరం జారె... కరెంటు పోయె...
శుభమా అని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుంది? పోనీ పోయిన కరెంటు వచ్చిన తర్వాత కాబోయే భర్త వేలికి తొడగాల్సిన ఉంగరం జారిపడితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు హలీవుడ్ హాట్ స్టార్ కామరూన్ డయాజ్ చక్కగా సమాధానాలివ్వగలుగుతారు. ఎందుకంటే.. ఇటీవల ఈ రెండూ ఆమెకు అనుభవంలోకి వచ్చాయి. సంగీతదర్శకుడు బెంజీ మాడ్డెన్తో ఇటీవల ఆమె వివాహం జరిగింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల బెంజీ స్వగృహంలో ఈ వేడుక జరిగింది. ఉంగరాలు మార్చుకునే సమయానికి కరెంటు పోయి, 20 సెకన్లలో వచ్చేసిందట. ఆ తర్వాత మాడ్డెన్ ఐదేళ్ల మేనల్లుడి చేతిలో ఉన్న ఉంగరాలు జారిపోయాయట. దాంతో మాడ్డెన్ సోదరులు గ్రూమ్ బెంజీ, బెస్ట్ మాన్ రింగులు తిరుగుతూ దూసుకెళుతున్న రింగులను పట్టుకోవడానికి తిప్పలు పడిన వైనం అతిథులుందర్నీ నవ్వించిందట. చివరికి ఉంగరాలను దక్కించుకుని సోదరుడి చేతిలో పెట్టడంతో వివాహ తంతు పూర్తయ్యింది. అప్పటివరకూ సీరియస్‌గా ఉన్న కామరూన్ తర్వాత కూల్ అయ్యారట. -
ఇక కల్యాణం... కమనీయం
హాలీవుడ్ అగ్రతారల్లో ఒకరైన కామరూన్ డయాజ్ ఇప్పటివరకు అరడజను మంది స్టార్స్‌తో డేటింగ్ చేశారు. వాళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోవాలనిపించలేదని పలు సందర్భాల్లో కామరూన్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి వీళ్లతో డేటింగ్ చేసి, పెళ్లి వరకూ వెళ్లని కామరూన్... కేవలం ఏడు నెలలుగా డేటింగ్ చేస్తున్న రాక్‌స్టార్ బెంజీ మాడ్డెన్తో మాత్రం పెళ్లికి సిద్ధపడ్డారు. కామరూన్ వయసిప్పుడు 42 ఏళ్ళు. బెంజీ ఆమె కన్నా దాదాపు ఆరేళ్లు చిన్నవాడు. కానీ, మనసులో ప్రేమ ఉంటే వయసుతో సంబంధం ఏంటి? అంటున్నారు కామరూన్. ఈ ఇద్దరి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా కామరూన్ వేలికి బెంజీ తొడిగిన వజ్రపుటుంగరం ఆమె చేతి అందాన్ని మరింత పెంచింది. వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఇది ఇలా ఉండగా, పెళ్లికి సిద్ధపడ్డ కామరూన్ తల్లవుతారా? లేదా? అన్నది ఇప్పుడు హాలీవుడ్లో జరుగుతున్న చర్చ. దీనికి కారణం లేకపోలేదు. మాతృత్వం మీద తనకంత మమకారం లేదని పలు సందర్భాల్లో కామరూన్ పేర్కొన్నారు. మరి.. ఆ నిర్ణయాన్ని రేపు పెళ్ళయ్యాక మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. -
ప్రకృతిని జయించలేను... క్షమించండి!
సినిమా తారలకు వయసు పైబడుతుంటే వారి అభిమానులకు ఆందోళనగా ఉంటుంది. వాళ్లు నిత్యయవ్వనంగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. వయసు కనబడనివ్వకుండా ఆర్టిస్టులు కూడా యంగ్‌గా కనిపించడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, శారీరక మార్పులు స్పష్టంగా కనిపించేస్తాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే హాలీవుడ్ తార కామరూన్ డయాజ్ ఆందోళన చెందుతున్నారు. ఆమె వయసు 41. కానీ, అభిమానులు మాత్రం 25 ఏళ్ల పడుచు పిల్లలా కనిపించాలని కోరుకుంటున్నారట. ఎప్పటికీ తనని అలానే చూడాలని ఆశపడుతున్నారట. ఈ విషయం గురించి ప్రస్తావించి, తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు కామరూన్. నిజానికి తనకూ అలాగే కనిపించాలని ఉందని, కానీ వయసనేది ప్రకృతితో ముడిపడింది కాబట్టి దాన్ని జయించలేనని, అభిమానులను నిరుత్సాహపరుస్తున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు కామరూన్.