క్యాంపాకోలా కూల్చివేత చిత్రీకరణ
అడ్డుకునేవారిపై చర్యలు తీసుకునేందుకే..
ముంబై: క్యాంపాకోలా విషయంలో ముంబై మహానగర పాలక సంస్థ(ఎంసీజీఎం) మరింత పట్టుదలగా వ్యవహరిస్తోంది. ఈ నెల 20 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభిస్తామని ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఎంసీజీఎం కూల్చివేత సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే విషయంపై దృష్టి సారించింది. తమ నివాసాలను కూల్చివేసేందుకు వస్తే అడ్డుకోవాలని ఇప్పటికే క్యాంపాకోలా వాసులు తీర్మానించుకోవడం తెలిసిందే. అయితే అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించి, అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకునేలా ఎంసీజీఎం వ్యూహరచన చేస్తోంది.
కూల్చివేత సమయంలో వీడియో ద్వారా చిత్రీకరించాలని, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే అందుకు సాక్ష్యాధారాలు ఉంటాయని, వారిపై చర్య తీసుకోవడం సులభమవుతుందని ఎంసీజీఎం భావిస్తోంది. ఈ విషయమై అదనపు మున్సిపల్ కమిషనర్ మోహన్ అద్తానీ మాట్లాడుతూ... ‘కూల్చివేత ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలతోచిత్రీకరించాలని నిర్ణయించాం. జూన్ 20 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎవరైనా అడ్డుపడితే వారు వీడియో కెమెరాలకు చిక్కాల్సిందే.
అలా చిక్కినవారిపై కోట్టు ధిక్కారం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా అక్రమ భవనాలకు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాను నిలిపివేస్తాం. రెండో దశలో భవనంలోపలి ఫ్లాట్ల కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తాం. ఆ తర్వాత బాల్కనీలను కూల్చివేసే పనులు మొదలు పెడతాం. నిజానికి మంగళవారం నుంచే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే మానవీయ కోణంలో ఆలోచించి మరో రెండ్రోజులు సమయమిచ్చాం. ఈలోగా కూడా ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంద’న్నారు.