Cancer treatments
-
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీలో ఉద్యోగులకు మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఆదేశించారు. -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!
సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి. అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్ కణాలనుకోవచ్చు. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా క్యాన్సర్ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్‌ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది. రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్‌లైట్ పడితే ఆగాలి. గ్రీన్‌లైట్ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు. రౌడీ కుర్రాళ్లు రెడ్‌లైట్ పడ్డాక కూడా బైక్‌ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి. దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్ కణాలు M. G. Naga Kishore Chief Surgical Oncologist, Omega Hospitals, Guntur Ph: 0863 2223300 సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు చేస్తాయి. అదెలాగో చూద్దాం. దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ కోసం రౌడీయిజమ్ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి. సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్’. సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్ యాంజియోజెనెసిస్’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్ యాంజియోసిస్ అంటారు. ఈ ‘ట్యూమర్ యాంజియోజెనెసిస్’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం. సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్‌నే ఈ క్యాన్సర్ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి. మోసాల... దొంగవేషాల కేడీలివి... Dr. Y Venkata Rami Reddy Medical Director, Omega Hospitals Kurnool, +91 6281066155 క్యాన్సర్ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి. సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్ కణపు ఎపిథీలియమ్ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్ కణాలన్నీ కనెక్టివ్ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్‌యాక్టివేషన్ ఆఫ్ మాలెక్యులార్ స్విచ్’ అంటారు. రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్‌కు చక్కెర మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి. మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్ రూపంలో క్యాన్సర్ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్‌తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్ రెస్పిరేషన్’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని అందుకున్న క్యాన్సర్ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్ నుంచి ‘గ్లైకాలసిస్’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణం ఇలా గ్లైకాలసిస్ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా! సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్‌తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్కెమికల్స్ ద్వారా సిగ్నల్స్‌తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్‌డెత్’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్ ట్యూమర్లు. దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి... సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్ కణాలూ దొంగవేషాలు వేస్తాయి. మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్ గౌండ్స్‌లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం. మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్‌నోడ్స్ ఒక ప్రోటీన్‌ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్‌నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే పోలీస్ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్‌ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్‌లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది. చికిత్సను తప్పించుకోడానికి రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్ ఆపరేషన్స్‌నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి. -
బియ్యం కన్నా చిన్న కంప్యూటర్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ను అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఇది బియ్యం గింజ కన్నా చాలా చిన్నది. ‘మిషిగాన్ మైక్రో మోట్’గా పిలుస్తున్న ఈ చిట్టి కంప్యూటర్ పనిచేసే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంది. సంప్రదాయ కంప్యూటర్లను ఆఫ్ చేసిన తరువాత కూడా వాటిలోని సమాచారం అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ను ఒకసారి స్విచాఫ్ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. ఈ సూక్ష్మ కంప్యూటర్లో ర్యామ్, కాంతి విద్యుత్ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వైర్లెస్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్లను అమర్చారు. పరిమాణంలో చిన్నవి కావడంతో వీటిలో ఆంటెనాకు బదులుగా కాంతి సాయంతో సమాచార మార్పిడి జరిగే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కంప్యూటర్ను కేన్సర్ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు. -
క్యాన్సర్ వాక్సిన్‌పై అవగాహన పెంచాలి: స్టాన్లీమార్క్స్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పదిహేనేళ్ల వయసువారు సైతం విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారని, కానీ భారత్‌లో మాత్రం క్యాన్సర్ వ చ్చిందని తెలిసినా చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రిన్స్‌బర్గ్ ఆంకాలజీ వర్సిటీ చైర్మన్, ప్రముఖ గైనిక్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ స్టాన్లీమార్క్స్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌పై దేశంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఓ హోటల్లో శుక్రవారం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ బాబయ్యతో కలిసి స్టాన్లీమార్క్స్ విలేకరులతో మాట్లాడారు. విదేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉందని, భారత్‌లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువ ఉందని తెలిపారు. అమెరికాలో 75 శాతం మంది ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకుంటే, భారత్‌లో ఒక్కశాతం కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇకనుంచైనా మారేలా చర్యలు చేపట్టాలన్నారు.