రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి! | Sakshi Special Story on World Cancer Day | Sakshi
Sakshi News home page

రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!

Published Thu, Feb 4 2021 1:22 AM | Last Updated on Thu, Feb 4 2021 1:31 AM

Sakshi Special Story on World Cancer Day

సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి.

అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ  జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్‌ కణాలనుకోవచ్చు.

ఈరోజు ‘వరల్డ్‌ క్యాన్సర్‌ డే’ సందర్భంగా క్యాన్సర్‌ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్‌ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది.

రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్‌లైట్‌ పడితే ఆగాలి. గ్రీన్‌లైట్‌ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్‌ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు.

రౌడీ కుర్రాళ్లు రెడ్‌లైట్‌ పడ్డాక కూడా బైక్‌ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్‌ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్‌ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి.

దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్‌ కణాలు

M. G. Naga Kishore
 Chief Surgical Oncologist, Omega Hospitals,
Guntur Ph: 0863 2223300

సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు.
కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్‌ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు  చేస్తాయి. అదెలాగో చూద్దాం.
దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్‌ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్‌ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్‌ కోసం రౌడీయిజమ్‌ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి.  
సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు  రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్‌’.  సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్‌ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్‌ యాంజియోజెనెసిస్‌’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్‌ యాంజియోసిస్‌ అంటారు.
ఈ ‘ట్యూమర్‌ యాంజియోజెనెసిస్‌’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం.  సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్‌ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్‌నే ఈ క్యాన్సర్‌ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి.

మోసాల... దొంగవేషాల కేడీలివి...

Dr. Y Venkata Rami Reddy
Medical Director,
Omega Hospitals Kurnool,
+91 6281066155

క్యాన్సర్‌ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి.
సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్‌ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్‌ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్‌ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్‌గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్‌ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్‌ కణపు ఎపిథీలియమ్‌ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్‌ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్‌ కణాలన్నీ కనెక్టివ్‌ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్‌యాక్టివేషన్‌ ఆఫ్‌ మాలెక్యులార్‌ స్విచ్‌’ అంటారు.

రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్‌కు చక్కెర
మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్‌ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి.  మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్‌ రూపంలో క్యాన్సర్‌ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్‌తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్‌ రెస్పిరేషన్‌’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని  అందుకున్న క్యాన్సర్‌ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్‌ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్‌ నుంచి ‘గ్లైకాలసిస్‌’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్‌ కణం ఇలా గ్లైకాలసిస్‌ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్‌ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది.

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001


మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్‌ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్‌ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్‌ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్‌ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం  మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.  కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు.       

సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా!
సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్‌తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్‌కెమికల్స్‌ ద్వారా సిగ్నల్స్‌తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్‌డెత్‌’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్‌లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్‌ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్‌ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్‌ ట్యూమర్లు.

దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి...
సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్‌ కణాలూ దొంగవేషాలు వేస్తాయి.
మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్‌ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్‌ గౌండ్స్‌లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్‌ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం.

మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్‌నోడ్స్‌ ఒక ప్రోటీన్‌ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్‌ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్‌నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే  పోలీస్‌ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్‌ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్‌ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్‌ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్‌ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ  ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్‌లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్‌ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది.  

చికిత్సను తప్పించుకోడానికి  
రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్‌ ఆపరేషన్స్‌నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్‌ షెల్టర్‌ జోన్‌ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్‌ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్‌ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్‌’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్‌ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement