canteen facility
-
వేతన జీవులకు మరో బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు లేదా వేతన జీవులకు మరో షాకింగ్ న్యూస్. ఫ్యాక్టరీలు లేదా ఆఫీసు క్యాంటీనల్లో అందించే కేటరింగ్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఈ విషయాన్ని గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) తెలిపింది. సర్వీసులపై జీఎస్టీ పెంపును ఏఏఆర్ ప్రతిపాదించిన అనంతరం ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటీన్లలో అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం రేటు అమల్లోకి వస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. 28.06.2017 నాటి సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ నెం.11/2017 ప్రకారం అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటిన్లకు అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఏఏఆర్ ప్రతిపాదించింది. దీంతో క్యాంటీన్ సర్వీసులు అందజేసే రేష్మి హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద 18 శాతం జీఎస్టీని విధిస్తోంది. దీనిపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలా? లేదా 5 శాతం జీఎస్టీ విధించాలా? అనే వివాదం చెలరేగింది. ఈ వివాదం నేపథ్యంలో ఏఏఆర్ పలు అంశాలను పరిశీలించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. జీఎస్టీ నిబంధనల కింద అవుట్డోర్ కేటరింగ్ అనే పదమే లేదని, అంతకముందు సర్వీసు పన్ను పాలనపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, కొన్ని కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే, ఆఫీసు లేదా ఇండస్ట్రీ ఫ్యాక్టరీలలో అందజేసేవి క్యాంటీన్ సర్వీసులే కాదని తేల్చి చెప్పింది. వీటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అవుట్డోర్ కేటరింగ్ ఈ సర్వీసులను అందజేస్తున్నాడని, ఈ నేపథ్యంలో 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. -
వైఎస్సార్ జనతా క్యాంటీన్ ప్రారంభం
హిందూపురం అర్బన్: మధ్యతరగతి, పేదల ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేయూతనందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట జనతా క్యాంటీన్ ను ప్రారంభించినట్లు హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తెలిపారు. గురువారం స్థానిక చిన్న మార్కెట్, ప్రభుత్వాస్పత్రి వద్ద క్యాంటీన్ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజూ జీవనోపాధికోసం పట్టణానికి వస్తున్న పేదలు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు టిఫెన్, భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. దీంతో అతి తక్కువ ధర రూ. 9కే కడుపు నిండా ఆహారం అందివ్వగలిగితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవకాశముంటుందని అన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. త్వరలో వీటిని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా మైనార్టీ గౌరవధ్యక్షులు ఫజులూ రహమన్, కౌన్సిల్ ప్లోర్ లీడర్ శివ, ఏ బీ బ్లాక్ కన్వీనర్లు ఇర్షాద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నారాయణస్వామి, మహిళ కన్వీనర్ నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, బీసీ, ఎస్సీసెల్ నాయకులు రాము, శ్రీన, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి, బాలాజీ, మైనార్టీ నాయకులు సమద్, ఇమ్రాన్, మన్సూర్, ముస్తక్, చాంద్‌బాషా, రియాజ్, రంగారెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. నాయకులకు ఈ ఆలోచన రాలేదు వందల వేల కోట్లు సంపాదించిన నాయకులకు పేదలకు సేవ చేయాలని తపన లేకుండా పోయిది. పేదలకు నామమాత్రపు ధరతో కడుపునిండా టిఫెన్, భోజనం అందించే చర్యలను వైఎస్సార్సీపీ సమన్వయకర్త చేపట్టడం అభినందనీయం. – శివ, కౌన్సిల్ ప్లోర్ లీడర్ రూ.9కే నాలుగు ఇడ్లీలు జనతా క్యాంటీన్ లో తొమ్మిది రూపాయలకు నాలుగు ఇడ్లీలు, సాంబర్, చెట్నీ ఇస్తున్నారు. పొంగల్, ఇతర టిఫెన్ కూడా అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం అన్నం, సాంబర్, పెరుగన్నం ఇస్తున్నారు. మాములుగా అయితే రూ.60 పెడితే టిఫెన్, రూ.100పెడితే గానీ భోజనం రాదు. – గంగాధర్, బేల్దార్, లేపాక్షి -
అడుగడుగునా యాజమాన్య నిర్లక్ష్యం
కార్మికుల మండిపాటు సంగారెడ్డి క్రైం : యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని గణపతి షుగర్స్ కార్మికులు ఆరోపించారు. అస్వస్థతకు గురై సంగారెడ్డిలోని బాలాజీ నర్సింగ్ హోం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. యాజమాన్యం క్యాంటీన్లో ఎటువంటి వసతులు కల్పించక పోగా పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు. భోజనం కూడా నాసిరకమైన ది సరఫరా చేస్తోందన్నారు. ఆరేళ్ల క్రితం కూడా గణపతి షుగర్స్ పరిశ్రమలో ఇలాగే కలుషిత ఆహారం తిని కార్మికులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. యాజమాన్యం కార్మికుల ప్రయోజనాలను మాత్రం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. క్యాంటీన్ సౌకర్యం బాగా లేదని పలుమార్లు యాజమాన్యానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికుల బాగోగులు పట్టించుకోని యాజమాన్యం గణపతి షుగర్స్ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ వారి బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని సీఐటీయూ ఇండ స్ట్రీయల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బీ మల్లేశం, కార్యదర్శి ఏ మాణిక్యంలు ఆరోపించారు. క్యాంటీన్లో కలుషిత ఆహారంతిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 మంది కార్మికులను వారు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేశారు. పరిశ్రమలో క్యాంటీన్ సౌకర్యం బాగోలేదని పలుమార్లు యాజమాన్యం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన క్యాంటీన్ సౌకర్యం, నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు మొత్తం యాజమాన్యమే భరించాలని, కార్మికుల ఆరోగ్యం మెరుగుయ్యే వరకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.