అడుగడుగునా యాజమాన్య నిర్లక్ష్యం
కార్మికుల మండిపాటు
సంగారెడ్డి క్రైం : యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని గణపతి షుగర్స్ కార్మికులు ఆరోపించారు. అస్వస్థతకు గురై సంగారెడ్డిలోని బాలాజీ నర్సింగ్ హోం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. యాజమాన్యం క్యాంటీన్‌లో ఎటువంటి వసతులు కల్పించక పోగా పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు. భోజనం కూడా నాసిరకమైన ది సరఫరా చేస్తోందన్నారు. ఆరేళ్ల క్రితం కూడా గణపతి షుగర్స్ పరిశ్రమలో ఇలాగే కలుషిత ఆహారం తిని కార్మికులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. యాజమాన్యం కార్మికుల ప్రయోజనాలను మాత్రం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. క్యాంటీన్ సౌకర్యం బాగా లేదని పలుమార్లు యాజమాన్యానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
కార్మికుల బాగోగులు పట్టించుకోని యాజమాన్యం
గణపతి షుగర్స్ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ వారి బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని సీఐటీయూ ఇండ స్ట్రీయల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బీ మల్లేశం, కార్యదర్శి ఏ మాణిక్యంలు ఆరోపించారు. క్యాంటీన్‌లో కలుషిత ఆహారంతిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 మంది కార్మికులను వారు బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేశారు. పరిశ్రమలో క్యాంటీన్ సౌకర్యం బాగోలేదని పలుమార్లు యాజమాన్యం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన క్యాంటీన్ సౌకర్యం, నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు మొత్తం యాజమాన్యమే భరించాలని, కార్మికుల ఆరోగ్యం మెరుగుయ్యే వరకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.