అతిపెద్ద ఆదిమచరిత్ర!
⇒ సిద్దిపేటలో బయటపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్
⇒ చరిత్రలో నిలవనున్న నంగునూరు మండలం నర్మేట గ్రామం
⇒ భారీ క్రేన్ ద్వారా పురాతన సమాధిపై భారీ శిల తొలగింపు
⇒ రెండు గంటపాటు శ్రమించిన పురావస్తుశాఖ అధికారులు
⇒ డీఎన్ఏ పరీక్షల ద్వారా త్వరలో ఇతర వివరాలు వెల్లడి
నంగునూరు: సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం నర్మేటలో బయటపడ్డ ప్రాచీన మానవుని సమాధి ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్(సమాధి మీద ఉంచే రాయి)గా నిలుస్తుందని పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు రాములునాయక్ పేర్కొన్నారు. నర్మేటలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగుచూసిన అతిపెద్ద సమాధిపై ఉన్న గండ శిలను మంగళవారం భారీ క్రేన్‌తో తొలగించారు. వారం రోజుల కిందట బండను లేపేందుకు ప్రయత్నించగా క్రేన్ వైర్లు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి భారీ క్రేన్‌ను తెప్పించారు. పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రంగాచార్యులు, పద్మనాభం పర్యవేక్షణలో బండను లేపేందుకు ప్రయత్నించారు. ఒక దశలో క్రేన్ పైకి లేవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.
డ్రైవర్‌కు సూచనలు చేస్తూ, రెండు గంటలపాటు శ్రమించి రాతిబండను ఎట్టకేలకు పక్కకు జరిపించడంతో...స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాములునాయక్ మాట్లాడుతూ మెన్హీర్ వద్ద బయటపడ్డ ఈ రాతి సమాధి సుమారుగా 40 టన్నులు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. 15 రోజులపాటు తవ్వకాలు జరిపి, అందులో లభించిన అవశేషాలకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రాచీన మానవులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారి ఆహా రపు అలవాట్లు ఏమిటి, జీవితకాలం ఎంత, వారి సంతతి ఎలా అంతరించిపోయింది అనే విషయాలపై శాస్త్రీయంగా పరిశోధన చేసి మూడు నెలల్లో బహిర్గతం చేస్తామన్నారు.
పెరిగిన సందర్శలకు తాకిడి
తవ్వకాల్లో బయటపడ్డ రాతి శిలను మంగళవారం తొలగిస్తున్నారని తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సిద్దిపేటలోని శ్రీవిద్య కళాశాల విద్యార్థులు అక్కడికి చేరుకొని మెన్హీర్, తవ్వకాల్లో బయటపడ్డ వస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సమాధిపై శిలను తొలగించడాన్ని ఆసక్తిగా తిలకించారు.
పక్కకు తొలగించిన సమాధిపై కప్పు