Capture Gold
-
మూడున్నర కిలోల బంగారం పట్టివేత
వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన వరంగల్ : బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. త్రివేండ్ర ం నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం వరంగల్‌లో ఆగగా, అందులో నుంచి తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన బాలక్రిష్ణన్ సీతారామన్(అయ్యప్పన్) దిగాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పోలీసులు పట్టు కొని విచారించారు. అతని బ్యాగులో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో సీతారామన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడి వద్ద బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ మాత్రం లభించింది. ఇదిలా ఉండగా 2014 జూన్‌లోనూ ఇదే వ్యక్తి 2.5 కిలోల బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా అప్పటి వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఐదు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల సీట్ల వద్దనున్న లగేజీలో ఐదు కిలోల బంగారుబిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిందితు లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. ప్రైవేట్ బస్సులో 50 కిలోల వెండి వస్తువులు.. జడ్చర్ల: ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 50 కిలోల వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కొందరు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు చేపట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పరిశీలించారు. మూడు బ్యాగుల్లో రూ.17 లక్షల విలువజేసే 50 కిలోల వెండి సామగ్రిని గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని వాణిజ్యపన్నులశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో సీటీవో రాధాగోపాల్ పన్ను, జరిమానా కింద రూ.55,536 వసూలు చేసి సామగ్రిని సదరు వ్యక్తికి అప్పగించారు.