
ఐదు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల సీట్ల వద్దనున్న లగేజీలో ఐదు కిలోల బంగారుబిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిందితు లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు.
ప్రైవేట్ బస్సులో 50 కిలోల వెండి వస్తువులు..
జడ్చర్ల: ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 50 కిలోల వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కొందరు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు చేపట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పరిశీలించారు. మూడు బ్యాగుల్లో రూ.17 లక్షల విలువజేసే 50 కిలోల వెండి సామగ్రిని గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని వాణిజ్యపన్నులశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో సీటీవో రాధాగోపాల్ పన్ను, జరిమానా కింద రూ.55,536 వసూలు చేసి సామగ్రిని సదరు వ్యక్తికి అప్పగించారు.