35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అమీరపేట్: అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించి 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఉద్దమర్రి గ్రామం లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజా కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు, కృష్ణమూర్తిలు కొంతకాలంగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తూ ఉద్దమర్రిలో ఓచోట డంప్ చేస్తున్నారు. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్దమర్రిలోని కృష్ణమూర్తి, నాగరాజుల ఇళ్లపై ఏకకాలంలో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు.
దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నాగరాజు, కృష్ణమూర్తిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రేషన్ డీలర్ సుగుణ ఆధీనంలో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ దీప్తీ, ఆర్ఐ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.