car industry
-
‘కారు’మబ్బులు!
కియా పరిశ్రమతో బతుకులు మారుతాయనుకుంటే.. ఆశల చుట్టూ ‘కారు’ చీకటి కమ్ముకుంటోంది. పిల్లల జీవితాలు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ 20 మందికి పైగా రైతులకు పరిహారం అందని పరిస్థితి. అన్ని అర్హతలున్నా రైతు కుటుంబాలను ఉద్యోగాలు ఊరిస్తూనే ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అదిగో.. ఇదిగో.. అనే ప్రకటనలకే పరిమితం కాగా.. కియా పరిశ్రమ ‘తమిళ తంబీ’లకు అడ్డాగా మారుతోంది. పెనుకొండ/పెనుకొండ రూరల్: పెనుకొండ సమీపంలోని అమ్మవారుపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమ నిర్మితమైంది. జిల్లాలోని దాదాపు 5వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూలీ పనులు తప్పిస్తే ఒక్కరికీ ఉద్యోగి కల్పించలేకపోయారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులుంటే ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఇదిలాఉంటే స్కిల్ పేరిట చెన్నై, జార్కండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని కనిపించిన ప్రతీ అధికారికి ఇక్కడి ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కియా అంటేనే ఓ మాయా ప్రపంచంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కియా కోసం రైతుల నుంచి భూములు సేకరించి దాదాపు రెండేళ్లవుతోంది. అమ్మవారుపల్లికి చెందిన రైతులు వడ్డె సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, నాగభూషణం, చలపతి, నాగరాజులకు ఎర్రమంచి పొలం సర్వే నంబర్ 193/10లో సుమారు 5 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఈ భూమి సేకరించింది. అయితేఇప్పటికీ వీరికి పరిహారం అందివ్వలేదు. ప్రస్తుతం వీరు జీవనాధారం కోల్పోయి కూలీ పనులకు వెళ్తున్నారు. వీరి పిల్లలు ఎంసీఏ, బీటెక్ చదివినా కనీసం ఉద్యోగ అవకాశం కూడా కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కియాలో ఉద్యోగాలు ఏవీ.. ప్రతి సమావేశంలో స్థానికులకే ఉపాధి కల్పిస్తాం.. కియా పరిశ్రమకు భూములిచ్చిన వారి పిల్లలందరికీ వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెబుతున్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. గత డిసెంబర్ 12న కియా పరిశ్రమలో ఇతర ప్రాంతాల వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందిస్తూ డిసెంబర్ 15న కియా పరిశ్రమ సమీపంలోని టూరిజం శాఖ కార్యాలయంలో భూనిర్వాసితుల కుటుంబాల పిల్లలతో తహసీల్దార్ హసీనాసుల్తానా దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికి 45 రోజులు గడిచినా ఉద్యోగాల ఊసే లేకపోయింది. పది రోజులుగా భూనిర్వాసితుల పిల్లల చదువును బట్టి వారికి కియా పరిశ్రమలో నేరుగా కాకుండా కియా అనుబంధ పరిశ్రమలైన హుందాయ్, మొబిస్, గ్లోవిస్, డైమోస్ అనే కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేస్తామని ఫోన్లు చేశారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా కియా అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా ఇంటర్వ్యూలు ఏడాది పొడవునా నిర్వహిస్తుండటం గమనార్హం. ప్లేట్లు, గ్లాసులతో సరి గత ఏడాది ఫిబ్రవరి మాసంలో కియా పరిశ్రమను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశాడే కానీ వీరి కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భూనిర్వాసితుల పిల్లలు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తారని భావించి అధికారులు, పోలీసులు బుజ్జగించి అడ్డుకున్నారు. తాజాగా సీఎం పర్యటన నేపథ్యంలో భూ నిర్వాసితుల పిల్లలు చంద్రబాబును నిలదీయకుండా పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. మొత్తంగా భూములు కోల్పోయి, ఉద్యోగాలు దక్కక రైతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కలగానే పరిశ్రమలు 2015 సెప్టెంబర్ 30న గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారి పక్కన రూ.750 కోట్లతో 953 ఎకరాల్లో బెల్, నాసన్ల పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బీజేపీకి చెందిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పరిశ్రమల నిర్మాణమే చేపట్టలేదు. అదేవిధంగా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద ఎయిర్‌బస్ నిర్మాణంతో పాటు ఫైవ్‌స్టార్ హోటల్ కడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు ఇప్పటికీ దిక్కు లేకుండా పోయింది. ఆచరణ లేని హామీలతో నిరుద్యోగులను ఒక పథకం ప్రకారం మోసగిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పయనం.. 2020 నాటికి ఏపీని ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్ది దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల సరసన నిలుపుతామని సీఎం చేసిన ప్రకటన నవ్వులపాలవుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులు తమ కుటుంబాలను వీడి బెంగళూరు, చెనై, హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాల్లో ఉద్యోగాల వేటకు వెళ్తున్నారు. పరిశ్రమల పేరుతో పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం బడా బాబులకు కట్టబెట్టింది. జాతీయ రహదారి పక్కన ఏ భూమి కనిపించినా లాగేసుకుంది. ప్రభుత్వం భూములు సేకరించే ప్రాంతంలో ముందుగానే తక్కువ ధరకు సమీప పొలాను కొనుగోలు చేసిన టీడీపీ నేతలు కోట్లకు పడగెత్తారు. అయితే పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో మాత్రం నైరాశ్యం అలుముకుంది. -
ఉద్యోగాల కల్పన పేరుతో టీడీపీ నయాదందా
నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం అర్హులకు అన్యాయం జరిగితే ఆందోళన తప్పదన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆర్డీవోతో చర్చించిన మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ : ‘మండలంలో ఏర్పాటు కానున్న కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ టీడీపీ నేతలు మభ్య పెడుతున్నారు. నిరుద్యోగులకు ఆశ చూపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీని వల్ల అర్హులకు అన్యాయం జరిగితే సహించబోం’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. టీడీపీ నేతలు సాగిస్తున్న నయా దందాపై ఆయన ఆర్డీవో రామ్మూర్తికి సోమవారం ఫిర్యాదు చేసి, మాట్లాడారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు కొందరు మభ్యపెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఈ రూపేనా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారి, అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు, భూములు స్వాధీనం చేసిన రైతుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. స్పందించిన ఆర్డీఓ శంకర్‌నారాయణ అభ్యర్థనపై ఆర్డీఓ రామ్మూర్తి సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల రాజకీయ నాయకులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు. ఆశలు రేకెత్తించడం నేరమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. -
2013 అమ్మకాలు బేకార్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గతేడాది 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీర్ఘకాలంగా ఉన్న మందగమనం కారణంగా 2013లో కార్ల విక్రయాలు 9.59 శాతానికి క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ(సియామ్) డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..., 2012లో 19,98,703గా ఉన్న దేశీయ కార్ల విక్రయాలు గతేడాది 18,07,011కు పడిపోయాయి. ఈ స్థాయి క్షీణత 2002 తర్వాత ఇదే మొదటిసారి. {దవ్యోల్బణం, వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ఇవన్నీ పెరుగుతుండడం అమ్మకాలపై ప్రభావం చూపాయి. ప్రస్తుతమున్న ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రతికూల సెంటిమెంట్ మరింత పెరిగింది. గత 17 నెలల్లో కేవలం మూడు నెలల్లో మాత్రం కార్ల అమ్మకాలు పెరిగాయి. 2012లో అక్టోబర్‌లో, 2013లో ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో మాత్రమే కార్ల విక్రయాలు వృద్ధి చెందాయి. మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడం, మైనింగ్ కార్యకలాపాలు స్తంభించిపోవడం వంటి కారణాల వల్ల వాణిజ్య వాహనాల అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. ఈ ఏడాది జూలై తర్వాత వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకోవచ్చు. అలాగే ప్రయాణికుల వాహనా విక్రయాలు కూడా కాస్త మెరుగుపడవచ్చు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 22 కొత్త కార్ల మోడళ్లు, 40 వేరియంట్లు, 10 మోడల్ రిఫ్రెష్‌లు మార్కెట్లోకి వచ్చాయి. గత నెలలో మారుతీ అమ్మకాలు 6.4 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 6.2%, హోండా కార్స్ అమ్మకాలు 29 శాతం చొప్పున పెరిగాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 42 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 27 శాతం తగ్గాయి. డిసెంబర్లో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 5 శాతం తగ్గాయి. యుటిలిటి వెహికల్ విక్రయాలు 10.44 శాతం, వ్యాన్ల అమ్మకాలు 36 శాతం, భారీ, మధ్య తరహా, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం తగ్గాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 21 శాతం తగ్గాయి. ఇక మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గగా, స్కూటర్ల అమ్మకాలు 30 శాతం పెరిగాయి. మొత్తం మీద టూవీలర్ల అమ్మకాలు 2 శాతం పెరిగాయి. హీరో మోటోకార్ప్ అమ్మకాలు 4 శాతం, బజాజ్ ఆటో అమ్మకాలు 32 శాతం తగ్గగా, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు మాత్రం 22 శాతం పెరిగాయి. మొత్తం అన్ని వాహనాల విక్రయాలు 14,49,203 నుంచి 1.21 శాతం క్షీణించి 14,31,632కు తగ్గిపోయాయి. మొత్తం ఎగుమతులు 2,61,920 నుంచి 10 శాతం క్షీణించి 2,88,525కు పెరిగాయి.