
ఉద్యోగాల కల్పన పేరుతో టీడీపీ నయాదందా
- నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం
- అర్హులకు అన్యాయం జరిగితే ఆందోళన తప్పదన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
- ఆర్డీవోతో చర్చించిన మాలగుండ్ల శంకరనారాయణ
పెనుకొండ :
‘మండలంలో ఏర్పాటు కానున్న కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ టీడీపీ నేతలు మభ్య పెడుతున్నారు. నిరుద్యోగులకు ఆశ చూపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీని వల్ల అర్హులకు అన్యాయం జరిగితే సహించబోం’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. టీడీపీ నేతలు సాగిస్తున్న నయా దందాపై ఆయన ఆర్డీవో రామ్మూర్తికి సోమవారం ఫిర్యాదు చేసి, మాట్లాడారు.
ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు కొందరు మభ్యపెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఈ రూపేనా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారి, అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు, భూములు స్వాధీనం చేసిన రైతుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.
స్పందించిన ఆర్డీఓ
శంకర్‌నారాయణ అభ్యర్థనపై ఆర్డీఓ రామ్మూర్తి సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల రాజకీయ నాయకులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు. ఆశలు రేకెత్తించడం నేరమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.