'ఏదోటి చేయండి లేదా చావుకు సిద్ధపడండి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిచేరుకుందని, దీన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టకుంటే చావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
'కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే ఏ చర్యనైనా స్వాగతించాల్సిందే. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీటిని భరించకపోతే కాలుష్యం బారిన పడి చనిపోడం ఖాయం. పొగమంచుతో ప్రాణాలు పోతాయి' అని రాహుల్ బజాజ్ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి ప్రైవేటు వాహనాలను నెలలో 15 రోజులు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయన మద్దతు పలికారు. కేజ్రీవాల్ మంచి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారని అన్నారు. 'కారు పూల్'ను ప్రోత్సహించాలన్నారు.
'కారు యజమానులు సైకిల్ పై వెళ్లమని లేదా బస్సులో వెళ్లాలని నేను చెప్పడం లేదన్నారు. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ స్నేహితుడిని కారులో తీసుకెళ్లండి లేదా మిమ్మల్ని పికప్ చేసుకోమని మీ స్నేహితులకు చెప్పండి. ఒక రోజు మీ కారులో, మరొక రోజు మీ స్నేహితుడి కారులో వెళ్లండి' అని రాహుల్ బజాజ్ సూచించారు.