car purchase
-
ఎలక్ట్రిక్ వాహనాలు రయ్..రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది (2021) మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 20,294 ఎలక్ట్రిక్ వాహనాలుండగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 35,677కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 15,383 ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగాయి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు మధ్యనే 12 వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 9,762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 21,765కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 12,003 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. కార్లూ పెరుగుతున్నాయ్ మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 7,957 ఎలక్ట్రిక్ కార్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 8,427కు చేరింది. అలాగే ఏడాది కాలంలో రాష్ట్రంలో ఈ–రిక్షాల సంఖ్య రెట్టింపైంది. గత ఏడాది మార్చి నాటికి ఈ–రిక్షాల సంఖ్య 672 కాగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 1,322కు పెరిగింది. ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాలు కేవలం 16 మాత్రమే ఉంటే.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 170కు పెరిగాయి. చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింత పెరుగుదల పెట్రోల్, డీజిల్ బంకుల తరహాలో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవల వాటి వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భవిష్యత్‌లో ఈ వాహనాల వినియోగం మరింత పెరుగుతుంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
పాత కారు.. టాప్ గేరు!
కరోనా వైరస్ పరిణామాలతో కొత్త కార్ల అమ్మకాలు కొంతకాలంగా దెబ్బతిన్నప్పటికీ యూజ్డ్ కార్ల (సెకండ్ హ్యాండ్) విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తొలిసారిగా సరఫరాకి మించి డిమాండ్ నెలకొనడం గమనార్హం. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో కొత్త కార్ల అమ్మకాలు 26.14 శాతం క్షీణించగా, యూజ్డ్ కార్ల విక్రయాలు ఏకంగా 22 శాతం పెరిగాయి. కార్ల కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన నిల్వలను వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే.. యూజ్డ్ కార్ల విక్రయ సంస్థలు .. డిమాండ్‌కి తగ్గ స్థాయిలో వాహనాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. ప్రీ–ఓన్డ్ కార్లను విక్రయించే శ్రీరామ్ ఆటోమాల్ గతంలో ప్రతి నెలా సుమారు 4,000–5,000 కార్లను విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఇది రెట్టింపై 10,000కు చేరింది. కరోనా పూర్వ స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం తమ వెబ్సైట్ ట్రాఫిక్ నాలుగు రెట్లు పెరిగిందని ఆన్లైన్ విక్రయ సంస్థ కార్స్24 వెల్లడించింది. తగ్గిన లభ్యత.. కొత్త కార్ల కొనుగోళ్లు పడిపోయిన నేపథ్యంలో పాత కార్లను ఎక్స్చేంజీ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. ఫలితంగా యూజ్డ్ కార్ల లభ్యత తగ్గిపోయింది. సాధారణంగా కొత్త కార్ల విక్రయాల్లో 26–27 శాతం దాకా ఉండే ఎక్స్చేంజీ విభాగం ఒక దశలో 6–7 శాతానికి పడిపోయింది. కొత్త కారు విలువ మూడు–నాలుగేళ్లలో సుమారు 30–50 శాతం దాకా పడిపోతుంది. చాలా మంది కస్టమర్లు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎక్స్చేంజీ వ్యాపారం తగ్గి .. ఈ కేటగిరీ వాహనాలకు కొరత ఏర్పడింది. దీంతో కస్టమర్లు తప్పనిసరై.. దాదాపు అయిదారేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా పాతబడిన కార్ల వైపు చూడటం మొదలుపెట్టాల్సి వచ్చింది. ధరల్లో భారీ వ్యత్యాసం.. కొత్త, పాత కార్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం కూడా కస్టమర్లు ప్రీ–ఓన్డ్ వాహనాల వైపు మళ్లుతుండటానికి ఒక కారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. బీఎస్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమల్లోకి వచ్చాక ఈ వ్యత్యాసం మరింతగా పెరిగిపోయిందని వివరించాయి. సుమారు 50,000–60,000 కి.మీ. ప్రయాణించిన ఓ అయిదేళ్లు పాతబడిన కారు... ప్రస్తుతం కొత్త కారు రేటులో సగానికే దొరుకుతోంది. ఇక ఫైనాన్షియర్స్ కూడా గతంతో పోలిస్తే ప్రస్తుతం యూజ్డ్ కార్లకు కూడా రుణాలు అందించేందుకు మరింతగా ముందుకొస్తున్నారు. మార్కెట్లోని అన్ని వర్గాలకూ ఈ పరిణామాలు సానుకూలంగా ఉంటున్నాయని వివరించారు. పెరిగిన ఎంక్వైరీలు.. దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ యూజ్డ్ కార్ల విభాగానికి గతేడాది గణనీయంగా ఎంక్వైరీలు వచ్చాయి. 2019లో వీటి సంఖ్య 16,53,264గా ఉండగా గతేడాది 17,51,928కి పెరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజలు క్రమంగా ప్రజా రవాణా సాధనాల నుంచి వ్యక్తిగత వాహనాల వైపు మళ్లుతున్నారని మారుతీ సుజుకీ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, ఆదాయాలు, ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొనడంతో .. చేతిలో కాస్త డబ్బు ఉంచుకునే ఉద్దేశంతో కొత్త కార్ల కన్నా యూజ్డ్ కార్ల వైపు కొంత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 57%మంది.. ప్రీ–ఓన్డ్ కార్ల వైపే మొగ్గుతున్నారు. వాటా పెంచుకుంటున్న బడా కంపెనీలు.. అసంఘటితంగా ఉన్న యూజ్డ్ కార్ల విభాగంలో వృద్ధి అవకాశాలు గుర్తించిన పెద్ద కంపెనీలు క్రమంగా ఈ కేటగిరీలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ మార్కెట్లో సంఘటిత సంస్థల వాటా 2019లో సుమారు 18% ఉండగా.. గతేడాది 25–27%కి పెరగడం ఇందుకు నిదర్శనం. వారంటీలు, సర్టిఫికేషన్ వంటి అదనపు ప్రత్యేకతల కారణంగా పెద్ద కంపెనీల వైపు మళ్లే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. గతేడాది జూలై–డిసెంబర్ మధ్యకాలం అమ్మకాల్లో అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 20% వృద్ధి సాధించింది. 2021–22లో 25% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈవో అశుతోష్ పాండే వెల్లడించారు. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. తన నెట్వర్క్ ద్వారా ప్రతి నెలా సుమారు 14,000 వాహనాలు విక్రయిస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా సుమారు 80 స్టోర్స్ తెరిచింది. దీంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 1,000కి పైగా చేరింది. అటు ప్రీ–ఓన్డ్ లగ్జరీ కార్ల (పీవోసీ) అమ్మకాలు కూడా జోరందు కుంటున్నాయి. మెర్సిడెస్–బెంజ్ పీవోసీ గత తొమ్మిదేళ్లలో 21,000 కార్లు విక్రయించింది. 20% పైగా వార్షిక వృద్ధి నమోదు చేసింది. -
పీఎన్బీ లోన్‌తో కొన్న కారు ఇదే!
న్యూఢిల్లీ : ఓ వైపు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పెద్ద తలనొప్పిలా మారింది. ఎంతో నమ్మకమైన బ్యాంకుగా పేరున్న పీఎన్బీకి, నీరవ్ మోదీ వల్ల ఆ పేరు ఒక్కసారిగా మంట కలిసిపోయింది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణం నీరవ్ మోదీ పాల్పడుతున్నప్పటికీ, బ్యాంకు అధికారులు గుర్తించకపోవడం యావత్తు దేశాన్ని నివ్వెరపరిచింది. కానీ కోట్లకుకోట్లు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ లాంటివారు ఈ బ్యాంకు కస్టమర్లుగా ఉన్నప్పటికీ, వారితో పాటు ఎంతో ఔన్నత్యం ఉన్న కస్టమర్లు కూడా ఈ బ్యాంకుకి ఉన్నారు. దీనికి సాక్ష్యం ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రినే. ఆయన చూపిన ఔన్నత్యం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఈ స్టోరీ 1964కు చెందింది. ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కావు. ప్రధాన మంత్రి అయ్యాక అధికారిక కారులోనే ఆయన పిల్లలు తోంగాలో సెయింట్ కోలంబా స్కూల్లో వెళ్లేవారు. కానీ దీనికి లాల్ బహదూర్ శాస్త్రి అనుమతించేవారు కాదు. ఈ సమయంలోనే తమకు ఓ సొంత కారు ఉంటే బాగుంటుందని తమ పిల్లలు సూచించారు. పలు ఎంక్వయిరీలు చేసిన తర్వాత కొత్త ఫియాట్ కారు కొనాలని శాస్త్రి నిర్ణయించారు. ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయలకు దొరికేది. కానీ ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7 వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. కారు కొనడానికి కావాల్సిన మిగతా మొత్తం అంటే 5 వేల రూపాయల కోసం శాస్త్రి బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. అలా 5వేల రూపాయల రుణం తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు లాల్ బహదూర్ శాస్త్రి కస్టమర్ అయిపోయారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఆ లోన్ తీర్చకముందే శాస్త్రి చనిపోయారు. ఆయన తరవాత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, ఆ లోన్‌ను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. కానీ శాస్త్రి భార్య లలితా శాస్త్రి దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. శాస్త్రి చనిపోయిన తర్వాత నాలుగేళ్లవరకు తనకొచ్చే పెన్షన్‌తో బ్యాంక్ రుణం మొత్తం తమ అమ్మ తీర్చేసినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి తెలిపారు. క్రీమ్ రంగులో 1964 మోడల్ అయిన ఈ ఫియాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కారు ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ 1లో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ కారును, ఆయన స్మృతులను చూడటానికి వస్తుంటారు. "కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం. కానీ ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకుని మరీ కారును కొనుగోలు చేశారు" అని అనిల్ శాస్త్రి తెలిపారు. -
కార్ల కొనుగోళ్లకూ ఆదాయాలకూ పొంతనేది?
పన్ను పరిధి నుంచి పెద్ద సంఖ్యలో తప్పించుకుంటున్నారన్న విమర్శ.. న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో ప్రజలు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. పన్ను రిటర్నుల ప్రకారం దేశంలో వార్షికంగా రూ.10 లక్షల పైబడిన ఆదాయం కలిగిన వారి సంఖ్య కేవలం 24 లక్షల మందేనని ఆ అధికారి పేర్కొంటూ, అయితే కొత్త కార్ల అమ్మకాల సంఖ్య మాత్రం వార్షికంగా 25 లక్షలుగా ఉంటోందన్నారు. వీటిలో లగ్జరీ కార్ల సంఖ్య దాదాపు 35,000. ‘‘ఒక కారు వినియోగ జీవిత కాలం దాదాపు ఏడేళ్లు. సామాన్యుడు ఒక కారు కొన్నాక మళ్లీ ఐదేళ్ల వరకూ కొత్త కారు కొనలేడు. అయినా వార్షికంగా పెద్ద సంఖ్య లో కార్ల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే, పన్ను పరిధిలోకి రాకుండా పలువురు తప్పించుకుంటు న్నట్లు అర్థమవుతోంది’’ అని ఆయన విశ్లేషించారు. ట్యాక్స్ రిటర్న్‌లు... 3.65 కోట్లు దేశంలో దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉంటే, 2014–15 అసెస్మెంట్ ఇయర్లో కేవలం 3.65 కోట్ల మంది వ్యక్తిగతంగా తమ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పన్ను పరిధికి వెలుపల ఉన్నారని అన్నారు. 3.65 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తే, ఇందులో కేవలం 5.5 లక్షల మంది మాత్రమే వార్షికంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మొత్తం పన్నుల బాస్కెట్లో ఒక్క వీరి వాటానే 57 శాతంగా ఉందన్నారు. అంటే రిటర్న్స్ ఫైల్ చేసే 3.65 కోట్ల మందిలో కేవలం 1.5 శాతం మంది వాటా పన్ను బాస్కెట్లో 57 శాతంగా ఉందని వివరించారు. గత మూడేళ్లలో వార్షికంగా వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షల కార్లు అమ్ముడయ్యాయని అధికారి వివరిస్తూ, కారు కొనడానికి ఆదాయం కలిగి ఉన్న పెద్ద సంఖ్యలోని ప్రజలు పన్ను బాస్కెట్ పరిధికి వెలుపల ఉంటున్నట్లు దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదికి రూ. కోటి ఆదాయం ఉన్నట్లు చూపుతున్న వారి సంఖ్య 48,417 అయితే, ప్రతి ఏడాదీ బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, మెర్సిడెస్, పోర్షే, మాసిరాటి వంటి లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 35,000గా నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారు వినియోగ కనీస కాలం దాదాపు ఏడేళ్లయితే, వార్షికంగా ఇన్ని కార్లు ఎలా అమ్ముడవుతాయని ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోల్చితే.. కాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే భారత్ పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఈ నిష్పత్తి కేవలం 16.7 శాతం అయితే, అమెరికాలో 25.4 శాతం, బ్రిటన్‌లో 30.3 శాతంగా ఉందన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పెద్ద నోట్ల రద్దు ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. దీనివల్ల అనధికార డబ్బును అధికారికంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నల్లకుబేరులకు ఏర్పడుతోందని అన్నారు. వారిపై పెద్ద ఎత్తున్న పన్ను కొరడా తప్పదని హెచ్చరించారు. -
బ్యాంకుకు రూ. 3.7 కోట్ల మేర టోపీ!!
ఫోర్జరీ పత్రాలతో వాహనాల కొనుగోళ్ల కోసం రుణాలు తీసుకుని బ్యాంకును రూ. 3.7 కోట్ల మేర మోసం చేసిన ఘరానా దొంగలను పోలీసులు గుర్తించారు. ఓ ఆటోమొబైల్ డీలర్ సహా మొత్తం 39 మందిపై కేసులు నమోదు చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మేనేజర్ ఎన్ఎ దుసానె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. 2013 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు డోంబివిలి శాఖలో వాహన రుణాల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటా అని చూస్తే, 2012లో సునీల్ మదాల్కర్ అనే వ్యక్తి కారు కొనుగోలు కోసం రూ. 14 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం నేరుగా మౌళి ఆటోమోటివ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. కానీ, రుణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు నకిలీ కొటేషన్లు, పత్రాలను సమర్పించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే.. మదాల్కర్ వాహనం ఆర్టీవోలో రిజిస్టర్ కాలేదని తెలిసింది. ఎందుకంటే.. ఆయన అసలు కారే కొనలేదు. మౌళి ఆటోమోటివ్ యజమాని నితిన్ పి డోంగ్రేతో కలిసి బ్యాంకుకు టోపీ పెట్టాడు. అది విజయవంతం కావడంతో, మరో 37 మంది కూడా అదే యజమాని సాయంతో బ్యాంకుకు మరింత పెద్ద టోపీ పెట్టారు. ఇదంతా కలిసి ఏకంగా రూ. 3.77 కోట్లకు చేరింది. దీంతో మొత్తం అందరిపైనా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.