కార్ల కొనుగోళ్లకూ ఆదాయాలకూ పొంతనేది?
పన్ను పరిధి నుంచి పెద్ద సంఖ్యలో తప్పించుకుంటున్నారన్న విమర్శ..
న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో ప్రజలు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. పన్ను రిటర్నుల ప్రకారం దేశంలో వార్షికంగా రూ.10 లక్షల పైబడిన ఆదాయం కలిగిన వారి సంఖ్య కేవలం 24 లక్షల మందేనని ఆ అధికారి పేర్కొంటూ, అయితే కొత్త కార్ల అమ్మకాల సంఖ్య మాత్రం వార్షికంగా 25 లక్షలుగా ఉంటోందన్నారు. వీటిలో లగ్జరీ కార్ల సంఖ్య దాదాపు 35,000. ‘‘ఒక కారు వినియోగ జీవిత కాలం దాదాపు ఏడేళ్లు. సామాన్యుడు ఒక కారు కొన్నాక మళ్లీ ఐదేళ్ల వరకూ కొత్త కారు కొనలేడు. అయినా వార్షికంగా పెద్ద సంఖ్య లో కార్ల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే, పన్ను పరిధిలోకి రాకుండా పలువురు తప్పించుకుంటు న్నట్లు అర్థమవుతోంది’’ అని ఆయన విశ్లేషించారు.
ట్యాక్స్ రిటర్న్‌లు... 3.65 కోట్లు
దేశంలో దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉంటే, 2014–15 అసెస్‌మెంట్ ఇయర్‌లో కేవలం 3.65 కోట్ల మంది వ్యక్తిగతంగా తమ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పన్ను పరిధికి వెలుపల ఉన్నారని అన్నారు. 3.65 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తే, ఇందులో కేవలం 5.5 లక్షల మంది మాత్రమే వార్షికంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మొత్తం పన్నుల బాస్కెట్‌లో ఒక్క వీరి వాటానే 57 శాతంగా ఉందన్నారు. అంటే రిటర్న్స్ ఫైల్ చేసే 3.65 కోట్ల మందిలో కేవలం 1.5 శాతం మంది వాటా పన్ను బాస్కెట్‌లో 57 శాతంగా ఉందని వివరించారు.
గత మూడేళ్లలో వార్షికంగా వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షల కార్లు అమ్ముడయ్యాయని అధికారి వివరిస్తూ, కారు కొనడానికి ఆదాయం కలిగి ఉన్న పెద్ద సంఖ్యలోని ప్రజలు పన్ను బాస్కెట్ పరిధికి వెలుపల ఉంటున్నట్లు దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదికి రూ. కోటి ఆదాయం ఉన్నట్లు చూపుతున్న వారి సంఖ్య 48,417 అయితే, ప్రతి ఏడాదీ బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, మెర్సిడెస్, పోర్షే, మాసిరాటి వంటి లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 35,000గా నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారు వినియోగ కనీస కాలం దాదాపు ఏడేళ్లయితే, వార్షికంగా ఇన్ని కార్లు ఎలా అమ్ముడవుతాయని ప్రశ్నించారు.
ఇతర దేశాలతో పోల్చితే..
కాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే భారత్ పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. భారత్‌లో ఈ నిష్పత్తి కేవలం 16.7 శాతం అయితే, అమెరికాలో 25.4 శాతం, బ్రిటన్‌లో 30.3 శాతంగా ఉందన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పెద్ద నోట్ల రద్దు ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. దీనివల్ల అనధికార డబ్బును అధికారికంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నల్లకుబేరులకు ఏర్పడుతోందని అన్నారు. వారిపై పెద్ద ఎత్తున్న పన్ను కొరడా తప్పదని హెచ్చరించారు.