లాల్ బహదూర్ శాస్త్రి ఫియాట్ కారు
న్యూఢిల్లీ : ఓ వైపు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పెద్ద తలనొప్పిలా మారింది. ఎంతో నమ్మకమైన బ్యాంకుగా పేరున్న పీఎన్‌బీకి, నీరవ్ మోదీ వల్ల ఆ పేరు ఒక్కసారిగా మంట కలిసిపోయింది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణం నీరవ్ మోదీ పాల్పడుతున్నప్పటికీ, బ్యాంకు అధికారులు గుర్తించకపోవడం యావత్తు దేశాన్ని నివ్వెరపరిచింది. కానీ కోట్లకుకోట్లు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ లాంటివారు ఈ బ్యాంకు కస్టమర్లుగా ఉన్నప్పటికీ, వారితో పాటు ఎంతో ఔన్నత్యం ఉన్న కస్టమర్లు కూడా ఈ బ్యాంకుకి ఉన్నారు. దీనికి సాక్ష్యం ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రినే. ఆయన చూపిన ఔన్నత్యం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు.
ఈ స్టోరీ 1964కు చెందింది. ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కావు. ప్రధాన మంత్రి అయ్యాక అధికారిక కారులోనే ఆయన పిల్లలు తోంగాలో సెయింట్ కోలంబా స్కూల్‌లో వెళ్లేవారు. కానీ దీనికి లాల్ బహదూర్ శాస్త్రి అనుమతించేవారు కాదు. ఈ సమయంలోనే తమకు ఓ సొంత కారు ఉంటే బాగుంటుందని తమ పిల్లలు సూచించారు. పలు ఎంక్వయిరీలు చేసిన తర్వాత కొత్త ఫియాట్ కారు కొనాలని శాస్త్రి నిర్ణయించారు. ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయలకు దొరికేది. కానీ ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7 వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయని తెలిసింది.
కారు కొనడానికి కావాల్సిన మిగతా మొత్తం అంటే 5 వేల రూపాయల కోసం శాస్త్రి బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. అలా 5వేల రూపాయల రుణం తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు లాల్ బహదూర్ శాస్త్రి కస్టమర్ అయిపోయారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఆ లోన్ తీర్చకముందే శాస్త్రి చనిపోయారు. ఆయన తరవాత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, ఆ లోన్‌ను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. కానీ శాస్త్రి భార్య లలితా శాస్త్రి దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు.
శాస్త్రి చనిపోయిన తర్వాత నాలుగేళ్లవరకు తనకొచ్చే పెన్షన్‌తో బ్యాంక్ రుణం మొత్తం తమ అమ్మ తీర్చేసినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి తెలిపారు. క్రీమ్ రంగులో 1964 మోడల్ అయిన ఈ ఫియాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కారు ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ 1లో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ కారును, ఆయన స్మృతులను చూడటానికి వస్తుంటారు. "కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం. కానీ ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకుని మరీ కారును కొనుగోలు చేశారు" అని అనిల్ శాస్త్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment