అడ్డంగా గీకేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ‘కార్డు క్రైమే’ అత్యధికంగా ఉంటోంది. ఈ ఆర్థిక నేరం బారినపడుతున్న బాధితులు నిలువునా మునుగుతున్నారు. సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. మొదటి వాటి బాధితులకు మాత్రమే ఆర్థిక నష్టం ఉంటుంది. ఈ కేసుల్లో అపరచితులే ఎక్కువగా నిందితులుగా ఉంటారు. రెండో తరహావి వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారు. కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ఈ తరహా కేసుల్లో అరెస్టయ్యారు. సైబర్ నేరాల్లో ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రా ష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో స్థిరపడిననైజీరియన్లేకీలకంగా దందా నడిపిస్తున్నారు.
‘ఓటీపీ క్రైమ్’ అంటే జార్ఖండే...
బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... డెబిడ్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత తామే సొంతంగా ‘కాల్ సెంటర్లను’ ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్లకు చేరుతున్నట్లు సమాచారం. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెబుతుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న త రవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడంతో టోకరా వేస్తున్నారు.
క్రైమ్‌కో సిమ్..
ఈ జమ్‌తార నేరగాళ్లు ఒక్కో నేరానికి ప్రత్యేకంగా ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వాడుతున్నారు. ‘పని’ పూర్తి కాగానే వాటిని ధ్వంసం చేస్తూ కేసుల దర్యాప్తులో పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న సెల్ఫోన్లు వాడుతుంటారు.
వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డులను వినియోగిస్తున్న వీరు ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలిగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ధ్వంసం చేస్తున్నారు.
బ్యాంకులు ఫోన్లు చేయవు
ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసులను కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. సైబర్ నేరాలను కొలిక్కి తీసుకురావడానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.– సైబర్ క్రైమ్ పోలీసులు