నోట్ల రద్దు: ప్రజలకు మరో బంపర్ చాన్స్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నగదు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటీఎంల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోలు బంకులు, బిగ్ బజార్లలో డెబిట్ కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకునే అవకాశం కల్పించగా, ఇప్పుడు తాజాగా ఐనాక్స్‌లలో కూడా ఇలాగే కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకోవచ్చని ప్రకటించారు. డబ్బులు డ్రా చేసుకోడానికి ప్రజలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్న సమయంలోనే సరిగ్గా బిగ్‌బజార్, ఐనాక్స్ థియేటర్లు ఈ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ రెండు చైన్లతోను తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టేట్‌బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. దాంతో ప్రజలకు మరింత సులభంగా కరెన్సీ నోట్లు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
బిగ్ బజార్ సంస్థ గురువారం నుంచి నగదు ఇస్తుండటం మొదలుపెట్టగా.. ఐనాక్స్ మాత్రం శుక్రవారం సాయంత్రం నుంచే ముంబైలోని మూడు మాల్స్‌లో డబ్బులు ఇస్తోంది. ఆదివారం నాటికి మరిన్ని థియేటర్లలో డబ్బులు ఇస్తామని ఐనాక్స్ ప్రతినిధి చెప్పారు. దీనిద్వారా డబ్బులు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంతవరకైనా తీర్చేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు ఐనాక్స్ లీజర్ డైరెక్టర్ సిద్దార్థ జైన్ చెప్పారు. ఇక బిగ్‌బజార్లలో తమ మాల్స్ పనిచేసినంత సేపూ డబ్బులు ఇస్తూనే ఉంటామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. డబ్బులు తీసుకోడానికి వచ్చేవాళ్లు మాల్‌లో ఏమీ కొనాల్సిన అవసరం లేదని.. అది వాళ్ల ఇష్టమని అన్నారు. అలాగే సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లన్నింటిలో కూడా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.