career guidence
-
Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు
గతంతో పోల్చితే ఈ రోజుల్లో చదువుకున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మంచి కంపెనీలలో ఉద్యోగమూ సంపాదిస్తున్నారు. ‘కానీ, ఆ ఆనందం వారిలో కొన్నాళ్లలోనే ఆవిరైపోతుంది..’ అంటున్నారు జ్యోత్సా్నరెడ్డి. నైపుణ్యాల లేమి కారణంగా నవతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ‘ప్రపంచానికి ఇప్పుడు మార్కులు, పర్సెంటేజీలు కాదు నైపుణ్యాలు కావాలి’ అని చెబుతున్న ఈ కెరీర్ గైడ్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘కెరీర్ పీడియా’ ద్వారా తన సేవలను అందిస్తున్నారు. మల్టిపుల్ కంపెనీలలో ఉద్యోగం చేసిన అనుభవం సొంతం చేసుకున్న జ్యోత్స్న తను తీసుకున్న నిర్ణయం గురించి, యువతరం ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, వాటి పరిష్కారాల దిశగా తాము చేస్తున్న ప్రయాణం గురించి వివరించారిలా... ‘‘ఎంబీయే పూర్తయ్యాక బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. అక్కడ గమనించిన వాటిలో ముఖ్యమైనది యువత ఎంత ఎక్కువ శాతంలో ఉద్యోగంలో చేరుతున్నారో.. అంతే శాతంలో రిజెక్ట్ కూడా అవడం. కారణం... వారు చదువుకున్న కాలేజీలలో పాఠ్యాంశాలే తప్ప ఇతర నైపుణ్యాలు నేర్పించరు. విద్యార్థులు కూడా వాటి మీద దృష్టి పెట్టరు. కొందరు మాత్రమే రాణించడానికి, మిగతావాళ్లు వెనకబడటానికి గల కారణాలేంటో కొన్నాళ్లు గమనించాను. ఉద్యోగంలో చేరినా.. పని సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం చాలా మందిలో ఉండటం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు కంపెనీలపై కూడా వీరి వల్ల ఒత్తిడి ఉంటుంది. కొన్నాళ్లు కొత్తగా చేరిన ఉద్యోగుల పనితీరును గమనించి, వారి ఫైల్స్ పక్కన పెట్టేస్తుంటారు. ఒక్క ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల లేమి అనే సమస్య ఉంది. దీనికి కోవిడ్ కూడా ఒక అడ్డంకి అయ్యింది. కంపెనీలు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌ను ఎడాప్ట్ చేసుకున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లేవు. దీంతో విద్యార్థుల్లో సంస్థలకు కావల్సిన క్వాలిటీ శాతం బాగా తగ్గింది. సంస్థలు ఇప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్ కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పిస్తే కంపెనీలకు కావాల్సిన టెక్నికల్ మాన్ పవర్‌ను అందించగలం అనుకున్నాం. మావారు రాహుల్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మా ఇద్దరిదీ ఒకే రంగం అవడం వల్ల తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేయగలుగుతున్నాం. మార్కులు కాదు ముఖ్యం.. నిజానికి ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమమనే చెప్పవచ్చు. విద్యార్థులు–సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకున్నాను. అయితే, ఇందుకు కావల్సిన వనరుల గురించి కూడా ఆలోచించాం. అప్పటికే మాకున్న మాతృసంస్థ ‘ఇన్ప్రాగ్’ ద్వారా ఆర్థికసాయం తీసుకుంటున్నాం. పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించడానికి, అలాగే ఇతరులకూ నామమాత్రపు ఫీజుతో స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి సాధ్యమయ్యింది. ‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకున్నారు’ అని తెలిసిన వారంటుంటారు. కష్టమైనా ఇష్టంతో చేస్తున్న పని. ఎంతో మందికి ఉపయోగపడే పని’ అని చెబుతుంటాను. అత్యాధునిక నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. అందుకని విద్యార్థులు ముందుగా స్పెషలైజేషన్‌లో భాగంగా వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని వివరించారు ఈ కెరీర్ప్లానర్. చదువుకుంటూనే నైపుణ్యాలు ‘ఇది కొంచెం కష్టమైన పనే. కానీ, విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాలను అలవర్చుకుంటే, తర్వాత ఉద్యోగావకాశాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించి కాలేజీల్లో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. డిగ్రీస్థాయివారి మాత్రమే కాదు ఇతర డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా వారి కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలోనే స్కిల్స్ పెంచుకుంటే, నేరుగా సంస్థల్లో తమ నైపుణ్యాలను చూపవచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంపాదన మొదలుపెట్టడానికి ఫ్రీలాన్స్ అవకాశాలను కూడా సెట్ చేస్తున్నాం. ఇందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నాం.’ – నిర్మలారెడ్డి -
Spoken English: ఇంగ్లిష్.. ఇలా సులువు!
ఇంగ్లిష్.. ఈ పేరు వినగానే తెలుగు మీడియం విద్యార్థులు హడలిపోతుంటారు. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. తమకు ఇంగ్లిష్ రాదని బాధ పడుతుంటారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన చెందుతుంటారు. పొరపాట్లు మాట్లాడితే.. అవతలి వాళ్లు అపార్థం చేసుకుంటారని ఊహించుకొని వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తలచుకొని ముందే భయపడిపోతుంటారు. అయితే ఇంగ్లిష్ భాషను మాట్లాడుతూ తేలిగ్గానే నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. మన విద్యార్థులు ఐఈఎల్టీఎస్, టోఫెల్ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ సైతం తీసుకుంటారు. కానీ ఇది పరీక్ష వరకు ఉపయోగపడినా.. నిత్యం దైనందిన జీవితంలో మనగలగాలంటే.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు చక్కగా రాయడం రావాలి. ఇంగ్లిష్ సినిమాలు భాష ఏదైనా సులభంగా నేర్చుకునే మార్గాల్లో శ్రద్ధగా వినిడానికి మించిన సాధనం లేదు. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినగలిగితే.. మాట్లాడటం నల్లేరుపై నడకే! ఇందుకు ఇంగ్లిష్ సినిమాలు సరైన మార్గం. సినిమాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తినే సాధనంగా చేసుకొని.. ఇంగ్లిష్ చిత్రాలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవచ్చు. భాషను సహజంగా అర్థం చేసుకోవడానికి.. ఇంగ్లిష్ వ్యవహారిక, సంభాషణ రూపాలకు అలవాటు పడటానికి.. భాషతో అనుభూతి పొందడానికి ఇంగ్లిష్ సినిమాలు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ చూడటం పరిపాటిగా మారింది. యూట్యూబ్‌లో ఇంగ్లిష్ స్పీకింగ్/లెర్నింగ్ వీడియోలు చూడటం ద్వారా.. భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఇంగ్లిష్ డాక్యుమెంటరీలు కూడా భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్లు–టీవీలు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పొందేందుకు నిత్యం ఇంగ్లిష్ పత్రికలు శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రామాణిక ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లు ఏకాగ్రతతో చూడటం, వినడం వంటివి చేయాలి. ఇంగ్లిష్ భాషలో వెలువడే వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ మంచి భాషను నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. చేయి తిరిగిన జర్నలిస్టులు పత్రికల్లో రాసే వార్తలు, వ్యాసాల ద్వారా ఎక్కడ ఎలాంటి పదాలు వాడాలో తెలుస్తుంది. అది పరీక్షల్లో సమాధానాలు రాయడంతోపాటు..ఇంటర్వ్యూలో మాట్లాడటంలోనూ ఉపయోగపడతుంది. అంతేకాకుండా ఇంగ్లిష్ వొకాబ్యులరీ మెరుగవుతుంది. ఇంగ్లిష్ పత్రికలు చదవడం, టీవీ ఛానళ్లను చూడటం ద్వారా స్పెల్లింగ్స్, ఉచ్ఛరణ, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకోవచ్చు. (నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు) వొకాబ్యులరీని ఒడిసిపట్టండిలా భాషను చక్కగా, అద్భుతంగా మాట్లాడాలంటే.. ముందు పదజాలం(వొకాబ్యులరీ)పై పట్టు సాధించాలి. అందుకు ఇంగ్లిష్ పత్రికల్లోని పదాలను అర్థాలతో సహా ఒక నోట్స్‌లో రాసుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజూ ఉపయోగించే పదాలు, పదబంధాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాలి. కొత్త పదం ఎప్పుడు ఎదురైనా.. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఆయా పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకార్థాలు, పద బంధాలను సైతం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా వాడాలో రాసుకోవాలి. ఇంగ్లిష్‌లో సంభాషణ వినడం,చదవడంతోపాటు తరచూ మాట్లాడం ద్వారా ఇంగ్లిష్‌ను త్వరగా నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. సొంతంగా మాట్లాడే నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారితోగాని, ఇంగ్లిష్ అప్పటికే బాగా వచ్చిన వారితోగాని స్నేహం చేయాలి. ఈ రెండూ కుదరకపోతే అద్దం ముందు నిల్చొని.. సొంతంగా మాట్లాడం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఏదైనా ఒక టాపిక్‌పై ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. దాన్ని రికార్డ్ చేసుకొని వినాలి. దీనిద్వారా భాషపై పట్టు సాధించడంతోపాటు లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్ ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. రోజుకు ఒక పదంతో మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో పదాలు, అర్థాలు, పదబంధాలు నేర్చుకునే స్థాయికి వెళ్లాలి. కేవలం పదాలను, పదబంధాలను చదివి గుర్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఆయా పదాలు ఏయే సందర్భాల్లో వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా ఆయా పదాలను వాడటానికి ప్రయత్నించాలి. సందర్భాలను కల్పించుకొని..అందు కు తగ్గట్టుగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇది నిత్యం దీర్ఘకాలం పాటు కొనసాగాలి. దీనివల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సొంతమవుతుంది. సరదా.. సరదాగా.. ఇంగ్లిష్‌ను నేర్చుకునేటప్పుడు తొలుత కొంత శ్రమతో కూడుకున్నదిగా, భారంగా అనిపించొచ్చు. దానివల్ల త్వరగా ఆసక్తి కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరణనిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త భాషను నేర్చుకోవడాన్ని ఆస్వాదించాలి. మీ ఆలోచనలను గౌరవించే స్నేహితులతో ‘వర్డ్ గేమ్స్’ ఆడటం, ఇంగ్లిష్ పజిల్స్ పూర్తిచేయడం వంటివి చేయాలి. దానివల్ల ఇంగ్లిష్ సరదాగా నేర్చుకున్నట్లు అవుతుంది. భాషను నేర్చుకునే క్రమంలో.. ఇంగ్లిష్‌లో ఆలోచించడం, ఇంగ్లిష్‌లో సంభాషించడం మేలు చేస్తుంది. గ్రామర్ అధ్యయనం కొత్త భాష కావడం వల్ల తొలుత అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంగ్లిష్ గ్రామర్ చదవడం చాలామందికి విసుగు పుట్టిస్తుంది. గ్రామర్‌ను స్కూల్ స్థాయిలో చదివే ఉంటాం. కాబట్టి మరోసారి గ్రామర్ రూల్స్ అధ్యయనం చేస్తే.. పొరపాట్లు లేకుండా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం అలవడుతుంది. విషయాన్ని చక్కగా కమ్యూనికేట్ చేయాలంటే.. భాష తీరుపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకు గ్రామర్ ఉపయోగపడుతుంది. టోఫెల్ వంటి పరీక్షల్లోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ.. గ్రామర్ తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం తప్పనిసరి. అందుకు వ్యాకరణ నియమాలు దోహదం చేస్తాయి. వీలైనంతగా మాట్లాడాలి చాలామంది ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడి.. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు జంకుతుంటారు. తమను తాము కంఫర్ట్ జోన్లో ఉంచేసుకుంటారు. నిజానికి మాట్లాడటం ద్వారానే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడితే అంత బాగా మన మనసు, మెదడు ఇంగ్లిష్ పదాలకు అలవాటు పడతాయి. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియగా భావించాలి. కేవలం వారం, నెల రోజుల్లోనే నేర్చేసుకుందామనుకుంటే.. అది సాధ్యమయ్యే పనికాదని గుర్తించాలి. ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలంటే.. భాషకు అంకితం అవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాలను సాధించగలం!! -
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్‌గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్‌లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
Career Guidance: న్యాయవాదిగా రాణించాలంటే..?
కెరీర్లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి? ► నైపుణ్యాలుంటే.. చక్కటి అవకాశాలు లభించే కోర్సు.. లా! గతంలో న్యాయ విద్య కోర్సులు అభ్యసించిన వారు కోర్టులకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు కార్పొరేట్ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనా పటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్. ► ఇంటర్మీడియెట్/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్ఎల్బీ/బీకామ్ ఎల్ఎల్బీ/ బీఎస్సీ ఎల్ఎల్బీ/బీబీఏ ఎల్ఎల్బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లా స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్– ఇండియా(ఎల్‌శాట్–ఇండియా); టీఎస్‌లాసెట్/ఏపీలాసెట్ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు. ► అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పొస్టు గ్రాడ్యుయేషన్‌లో.. సివిల్/క్రిమినల్/ కార్పొరేట్/ఎన్విరాన్మెంటల్/కాన్స్టిట్యూషనల్/సైబర్/ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/రియల్ ఎస్టేట్ లా/మీడియా లా/ఇంటర్నేషనల్/బిజినెస్ లా/ట్యాక్స్‌లా.. ఇలా పలు స్పెషలైజేషన్స్ చేయవచ్చు. డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
టెన్త్ విద్యార్థులకు నేడు కెరీర్ గెడైన్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి తరువాత ఏ కోర్సులో చేరాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ బుధవారం కెరీర్ గెడైన్స్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బుధవారం ఉదయం 10:30 నుంచి ఒంటిగంట వరకు నిఫుణులతో కెరీర్ గెడైన్స్, కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని మన టీవీ చానల్ ద్వారా నిర్వహించనుంది. మన టీవీ చానల్ ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. టోల్‌ఫ్రీ నంబరు 18004254038 కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపాయి.