Spoken English: ఇంగ్లిష్‌.. ఇలా సులువు! | Spoken English: Learn English Speaking Simple Tips | Sakshi
Sakshi News home page

Spoken English: ఇంగ్లిష్‌.. ఇలా సులువు!

Published Tue, Sep 21 2021 6:30 PM | Last Updated on Tue, Sep 21 2021 6:43 PM

Spoken English: Learn English Speaking Simple Tips - Sakshi

ఇంగ్లిష్‌.. ఈ పేరు వినగానే తెలుగు మీడియం విద్యార్థులు హడలిపోతుంటారు. ఎంత సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఉన్నా.. తమకు ఇంగ్లిష్‌ రాదని బాధ పడుతుంటారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన చెందుతుంటారు. పొరపాట్లు మాట్లాడితే.. అవతలి వాళ్లు అపార్థం చేసుకుంటారని ఊహించుకొని వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తలచుకొని ముందే భయపడిపోతుంటారు. అయితే ఇంగ్లిష్‌ భాషను మాట్లాడుతూ తేలిగ్గానే నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... 

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. మన విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్, టోఫెల్‌ వంటి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్‌ సైతం తీసుకుంటారు. కానీ ఇది పరీక్ష వరకు ఉపయోగపడినా.. నిత్యం దైనందిన జీవితంలో మనగలగాలంటే.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు చక్కగా రాయడం రావాలి. 


ఇంగ్లిష్‌ సినిమాలు

భాష ఏదైనా సులభంగా నేర్చుకునే మార్గాల్లో శ్రద్ధగా వినిడానికి మించిన సాధనం లేదు. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినగలిగితే.. మాట్లాడటం నల్లేరుపై నడకే! ఇందుకు ఇంగ్లిష్‌ సినిమాలు సరైన మార్గం. సినిమాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తినే సాధనంగా చేసుకొని.. ఇంగ్లిష్‌ చిత్రాలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవచ్చు. భాషను సహజంగా అర్థం చేసుకోవడానికి.. ఇంగ్లిష్‌ వ్యవహారిక, సంభాషణ రూపాలకు అలవాటు పడటానికి.. భాషతో అనుభూతి పొందడానికి ఇంగ్లిష్‌ సినిమాలు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్‌ చూడటం పరిపాటిగా మారింది. యూట్యూబ్‌లో ఇంగ్లిష్‌ స్పీకింగ్‌/లెర్నింగ్‌ వీడియోలు చూడటం ద్వారా.. భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఇంగ్లిష్‌ డాక్యుమెంటరీలు కూడా భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. 


న్యూస్‌ పేపర్లు–టీవీలు

ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానాన్ని పొందేందుకు నిత్యం ఇంగ్లిష్‌ పత్రికలు శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రామాణిక ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానళ్లు ఏకాగ్రతతో చూడటం, వినడం వంటివి చేయాలి. ఇంగ్లిష్‌ భాషలో వెలువడే వార్తా పత్రికలు, మ్యాగజైన్స్‌ మంచి భాషను నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. చేయి తిరిగిన జర్నలిస్టులు పత్రికల్లో రాసే వార్తలు, వ్యాసాల ద్వారా ఎక్కడ ఎలాంటి పదాలు వాడాలో తెలుస్తుంది. అది పరీక్షల్లో సమాధానాలు రాయడంతోపాటు..ఇంటర్వ్యూలో మాట్లాడటంలోనూ ఉపయోగపడతుంది. అంతేకాకుండా ఇంగ్లిష్‌ వొకాబ్యులరీ మెరుగవుతుంది. ఇంగ్లిష్‌ పత్రికలు చదవడం, టీవీ ఛానళ్లను చూడటం ద్వారా స్పెల్లింగ్స్, ఉచ్ఛరణ, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకోవచ్చు. (నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు)


వొకాబ్యులరీని ఒడిసిపట్టండిలా

భాషను చక్కగా, అద్భుతంగా మాట్లాడాలంటే.. ముందు పదజాలం(వొకాబ్యులరీ)పై పట్టు సాధించాలి. అందుకు ఇంగ్లిష్‌ పత్రికల్లోని పదాలను అర్థాలతో సహా ఒక నోట్స్‌లో రాసుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజూ ఉపయోగించే పదాలు, పదబంధాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాలి. కొత్త పదం ఎప్పుడు ఎదురైనా.. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఆయా పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకార్థాలు, పద బంధాలను సైతం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా వాడాలో రాసుకోవాలి. 

ఇంగ్లిష్‌లో సంభాషణ
వినడం,చదవడంతోపాటు తరచూ మాట్లాడం ద్వారా ఇంగ్లిష్‌ను త్వరగా నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. సొంతంగా మాట్లాడే నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనే తపన ఉన్న వారితోగాని, ఇంగ్లిష్‌ అప్పటికే బాగా వచ్చిన వారితోగాని స్నేహం చేయాలి. ఈ రెండూ కుదరకపోతే అద్దం ముందు నిల్చొని.. సొంతంగా మాట్లాడం ప్రాక్టీస్‌ చేయాలి. లేదా ఏదైనా ఒక టాపిక్‌పై ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. దాన్ని రికార్డ్‌ చేసుకొని వినాలి. దీనిద్వారా భాషపై పట్టు సాధించడంతోపాటు లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. 


ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌

ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం పెంచుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్‌ చేయాలి. రోజుకు ఒక పదంతో మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో పదాలు, అర్థాలు, పదబంధాలు నేర్చుకునే స్థాయికి వెళ్లాలి. కేవలం పదాలను, పదబంధాలను చదివి గుర్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఆయా పదాలు ఏయే సందర్భాల్లో వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా ఆయా పదాలను వాడటానికి ప్రయత్నించాలి. సందర్భాలను కల్పించుకొని..అందు కు తగ్గట్టుగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇది నిత్యం దీర్ఘకాలం పాటు కొనసాగాలి. దీనివల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సొంతమవుతుంది. 

సరదా.. సరదాగా.. 
ఇంగ్లిష్‌ను నేర్చుకునేటప్పుడు తొలుత కొంత శ్రమతో కూడుకున్నదిగా, భారంగా అనిపించొచ్చు. దానివల్ల త్వరగా ఆసక్తి కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరణనిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త భాషను నేర్చుకోవడాన్ని ఆస్వాదించాలి. మీ ఆలోచనలను గౌరవించే స్నేహితులతో ‘వర్డ్‌ గేమ్స్‌’ ఆడటం, ఇంగ్లిష్‌ పజిల్స్‌ పూర్తిచేయడం వంటివి చేయాలి. దానివల్ల ఇంగ్లిష్‌ సరదాగా నేర్చుకున్నట్లు అవుతుంది. భాషను నేర్చుకునే క్రమంలో.. ఇంగ్లిష్‌లో ఆలోచించడం, ఇంగ్లిష్‌లో సంభాషించడం మేలు చేస్తుంది. 


గ్రామర్‌ అధ్యయనం

కొత్త భాష కావడం వల్ల తొలుత అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంగ్లిష్‌ గ్రామర్‌ చదవడం చాలామందికి విసుగు పుట్టిస్తుంది. గ్రామర్‌ను స్కూల్‌ స్థాయిలో చదివే ఉంటాం. కాబట్టి మరోసారి గ్రామర్‌ రూల్స్‌ అధ్యయనం చేస్తే.. పొరపాట్లు లేకుండా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం అలవడుతుంది. విషయాన్ని చక్కగా కమ్యూనికేట్‌ చేయాలంటే.. భాష తీరుపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకు గ్రామర్‌ ఉపయోగపడుతుంది. టోఫెల్‌ వంటి పరీక్షల్లోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ.. గ్రామర్‌ తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం తప్పనిసరి. అందుకు వ్యాకరణ నియమాలు దోహదం చేస్తాయి. 

వీలైనంతగా మాట్లాడాలి 
చాలామంది ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడి.. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు జంకుతుంటారు. తమను తాము కంఫర్ట్‌ జోన్‌లో ఉంచేసుకుంటారు. నిజానికి మాట్లాడటం ద్వారానే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడితే అంత బాగా మన మనసు, మెదడు ఇంగ్లిష్‌ పదాలకు అలవాటు పడతాయి. ఇంగ్లిష్‌ భాషను నేర్చుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియగా భావించాలి. కేవలం వారం, నెల రోజుల్లోనే నేర్చేసుకుందామనుకుంటే.. అది సాధ్యమయ్యే పనికాదని గుర్తించాలి. ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలంటే.. భాషకు అంకితం అవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాలను సాధించగలం!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement