ప్రతీకాత్మక చిత్రం
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!!
ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్‌లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్‌మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు.
సీఏ
చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఎంబీఏ
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం.
కోర్సుల వ్యవధి
సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది.
సీఏతో కెరీర్
సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.
ఎంబీఏతో ఉద్యోగాలు
ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్‌ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్‌ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
నైపుణ్యాలు
► చార్టర్డ్ అకౌంటెంట్‌గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి.
► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి.
దేనికదే ప్రత్యేకం
► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది.
► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు.
► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్‌బీ తదితర టాప్ బీ స్కూల్స్‌లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment