చిరు వ్యాపారులపై ‘ట్రేడ్’ కొరడా
చిన్న షాపులకు, బడా సంస్థలకు ఒకేలా ట్రేడ్ లెసైన్సు ఫీజు
సంస్థ ఉండే ప్రాంతం, స్థాయి, ఆదాయం పట్టించుకోని వైనం
రూ.10 వేలు వచ్చేవారికి.. రూ.లక్ష ఆర్జించే వారికీ ఒకే ఫీజు
ఆస్తిపన్ను తరహాలో ఫీజుంటే మేలంటున్న వ్యాపారులు
చాంద్రాయణగుట్టలో 400 చ.అ.ల విస్తీర్ణంలో స్వీటు షాపు నిర్వహిస్తున్న సులేమాన్‌కు జీహెచ్ఎంసీ అధికారులు చ.అ.కు రూ.ఐదు వంతున రూ.2000 ట్రేడ్ లెసైన్సు ఫీజుగా విధించారు. బంజారాహిల్స్‌లో 400 చ.అ.ల విస్తీర్ణంలో స్వీటు షాపు నిర్వహిస్తున్న అప్పారావుకు కూడా అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు చ.అ.కు రూ. ఐదు వంతున రూ.2000 ట్రేడ్ లెసైన్సు ఫీజుగా విధించారు. బంజారాహిల్స్‌లో స్వీటు షాపు నిర్వహిస్తున్న అప్పారావుకు అది పెద్ద భారంగా కనిపించలేదు.
తనకు జరిగే రోజువారీ వ్యాపారం.. వచ్చే ఆదాయం తదితరమైనవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చాంద్రాయణగుట్టలోని సులేమాన్ మాత్రం అంతటి భారం తాను మోయలేనంటూ లబోదిబోమంటున్నాడు. కారణం.. తనకు జరిగే వ్యాపారం.. పనివాళ్ల జీతాలు.. తదితరమైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి అది చాలా భారమన్నాడు.
ట్రేడ్ లెసైన్సుల ఫీజు విధింపులో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన కొత్త పద్ధతి సులేమాన్ లాగే ఎందరో వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రేడ్ లెసైన్సు ఫీజు సరళీకరణ పేరిట అధికారులకు తాము చేసింది సబబుగానే కనిపించినా.. పలువురు చిరు వ్యాపారులకు అది మోయలేని భారంగా మారింది. నెలకు రూ. 10 వేల ఆదాయం వచ్చేవారికి.. లక్ష రూపాయల ఆదాయం వచ్చేవారికి ఒకేవిధంగా ట్రేడ్‌లెసైన్సుల ఫీజులు విధించడమే ఇందుకు కారణం.
ఆదాయాన్ని బట్టి కాకుండా..
గతంలో ఆయా వ్యాపారులకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి ట్రేడ్‌లెసైన్సు ఫీజు ఖరారు చేసేవారు. పలువురు వ్యాపారులు ట్రేడ్ లెసైన్సు విభాగం అధికారులతో కుమ్మక్కవుతూ వాస్తవ ఆదాయం కంటే తక్కువ ఆదాయం పేర్కొంటూ చెల్లించాల్సిన ఫీజు కంటే తక్కువే చెల్లిస్తున్నారంటూ కొత్త విధానాన్ని ఈ సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చారు. దుకాణం/ సంస్థ/ ఆస్పత్రి/హోటల్/ ఇతరత్రా వ్యాపారాలన్నింటికీ ఇదే విధానాన్ని అమల్లోకి తేవడంతో వేల సంఖ్యలోని చిరు, మధ్యస్థాయి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో సంస్థ స్థాయి.. జరిగే వ్యాపారాన్ని బట్టి ఫీజు వసూలు చేసేవారు. ఉదాహరణకు 30 పడకల ఆస్పత్రికి ఒక రకమైన ఫీజు.. 100 పడకల ఆస్పత్రికి అంతకంటే ఎక్కువ ఫీజు ఉండేవి. ఇప్పుడలా కాకుండా పడకలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా ఫీజు విధించడంతో చిరు వ్యాపారులు.. చిన్న సంస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రాంతాన్ని పట్టించుకోకుంటే ఎలా?
ఆస్తిపన్ను విధింపులకు ప్లింత్ ఏరియానే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. ఆయా ప్రాంతాల డిమాండ్.. అక్కడి సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని.. ఏ, బీ, సీ గ్రేడ్లుగా ప్రాంతాలను విభజించి రేట్లు నిర్ణయించారు. అదే విధానాన్ని ట్రేడ్ లెసైన్సుల ఫీజులోనూ విధిస్తే సమంజసంగా ఉండేది. కానీ.. సంపన్న ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని వారికి.. పేద బస్తీలైన బతుకమ్మ కుంట, పురానాపూల్ వంటి ప్రాంతాల్లోనూ ఒకే రకమైన వ్యాపారాలకు ఒకే విధంగా ట్రేడ్ లెసైన్సు ఫీజు విధించడం దారుణమని పలువురు చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తవారికి వెంటనే సర్టిఫికెట్
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రొవిజనల్ ట్రేడ్ లెసైన్సు సర్టిఫికెట్‌ను వెంటనే జారీ చేస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 15 లోగా రెన్యువల్ చేయించుకుంటే పెనాల్టీ ఉండదని, ఆ తర్వాత నెలకు 2 శాతం వంతున పెనాల్టీ ఉంటుం దన్నారు. ఇప్పటిదాకా లెసైన్సు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రేడ్ లెసైన్సులు లేకున్నా.. రెన్యువల్ చేయించుకోకున్నా సదరు సంస్థల్ని సీజ్ చేసే, అవి విక్రయించే సామాగ్రిని సీజ్ చేసే అధికారం తమకు ఉంటుందన్నారు.
జూన్ 15 లోగా ఫీజు చెల్లించండి: కమిషనర్
గ్రేటర్ పరిధిలో వ్యాపారాలు చేసేవారంతా ట్రేడ్ లెసైన్సుల్ని రెన్యువల్ చేయించుకోవాలని, ఇప్పటికీ ట్రేడ్ లెసైన్సులు లేనివారు వాటిని పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈసేవా సెంటర్లు.. సీఎస్సీల ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కొత్త లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
ఇందుకోసం గతం కంటే భిన్నంగా సరళమైన విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తద్వారా సెల్ఫ్ అసెస్మెంట్తో ట్రేడ్ లెసైన్సు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. వ్యాపార రకం (కేటగిరీ).. ప్లింత్ఏరియాను బట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజులు.. వాటితోపాటు గార్బేజి చార్జీలు నిర్ణయించామన్నారు. మొత్తం వ్యాపార సంస్థలన్నింటినీ ఐదు కేటగిరీలుగా విభజించినట్లు పేర్కొన్నారు.
ఒక్కో కేటగిరీలో మళ్లీ సబ్ కేటగిరీలున్నాయన్నారు. ఉదాహరణకు ఎ కేటగిరీలో ఆహారపదార్థాలుండగా, అందులోని సబ్ కేటగిరీల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీ ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే సంస్థలు తదితరమైనవి ఉన్నాయని వివరించారు. ఇలా సబ్ కేటగిరీలను బట్టి కొన్నింటికి చ.అ.కు రూ. మూడు ఉండగా, మరి కొన్నింటికి చ.అ.కు రూ. ఏడు వరకు ఉందన్నారు. వెరసి ఒక్కో కేటగిరీలో చ.అ.కు రూ.మూడు నుంచి రూ. ఏడు వరకు ఫీజులున్నాయని తెలిపారు.