మున్నాకు మళ్లీ పెరోల్‌పై వివాదం
ముంబై: అక్రమ ఆయుధాల కేసులో పుణే ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు రెండోసారి పెరోల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల ఆందోళనతో దిగివచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. జైలు అధికారులు సిఫార్సుపై పుణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ శుక్రవారం సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరు చేశారు. రెండు నెలల క్రితం తన అనారోగ్య కారణాలతో పెరోల్‌పై బయటకు వచ్చిన సంజయ్‌దత్.. ఈ సారి తన భార్య మాన్యత అనారోగ్య కారణాన్ని చూపించారు. కాగా, మాన్యత ఒక పుట్టినరోజు పార్టీకి హాజరైన ఫొటోలు శనివారంనాడు పేపర్లలో ప్రచురితం కావడంతో ఆమె అనారోగ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.
దీంతో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు జైలు ముందు నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు. బాలీవుడ్ నటుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జైలు అధికారులపై విరుచుకుపడ్డారు. పెరోల్ రద్దు చేయకపోతే జైల్ భరో నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోపక్క బీజేపీ కూడా జైలు అధికారుల చర్యపై మండిపడింది. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని, సంజయ్‌కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో బీజేపీ ఉపనేత గోపీనాథ్ ముండే డిమాండ్ చేశారు. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ పెరోల్ మంజూరుపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.
మాన్యత కాలేయంలో కణితి: డాక్టర్
పెరోల్‌కు తన భార్య అనారోగ్యాన్ని సంజయ్‌దత్ కారణంగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో మాన్యతకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అజయ్ చౌగులే వివరణ ఇచ్చారు. ఆమె కాలేయంలో కణితి ఉందని, అంతేగాక హృద్రోగ లక్షణాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నామని, అవి పూర్తయిన తర్వాత శస్త్రచికిత్స అవసరాన్ని గురించి ఆలోచిస్తామన్నారు.