విద్యుత్ చౌర్యంపై దాడులు
182 మందిపై కేసులు నమోదు
రూ.16 లక్షల జరిమానా విధింపు
నెల్లూరు (టౌన్): జిల్లాలో విద్యుత్ చౌర్యంపై తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న 182 మందిపై బుధవారం ట్రాన్స్‌కో విజిలెన్స్, యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్ఈ రవి, ఏపీటీఎస్ ఎస్పీ మనోహర్‌రావు తెలిపారు. విద్యుత్‌భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కావలి, కావలి రూరల్, జలదంకి, వింజమూరు, ఇందుకూరుపేట, తదితర డివిజన్లల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 62 మంది అధికారులు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మీటర్ ఉండి కనెక్షన్‌ను బైపాస్ చేసిన 31 మంది, మీటరు లేకుండా నేరుగా తీగలకు తగిలించి చౌర్యానికి పాల్పడుతున్న 60 మంది, గృహానికి కనెక్షన్‌ను తీసుకొని వ్యాపారానికి వినియోగిస్తున్న 19 మంది, బిల్లింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్న ఇద్దరు, అదనపు లోడ్‌ను వినియోగిస్తున్న 67 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.16 లక్షల జరిమానాను వసూలు చేశామని వివరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిలో ఆక్వాకు సంబంధించి రూ.ఏడు లక్షలు, కనెక్షన్ లేకుండా ఏసీని వినియోగిస్తున్న వినియోగదారుడి నుంచి రూ.లక్ష అపరాధ రుసుముగా వసూలు చేశామని వివరించారు. విద్యుత్ కనెక్షన్ లేని వారు దీనదయాళ్ యోజన పథకం నుంచి రూ.125కే సర్వీసును పొందవచ్చని వివరించారు. ఏపీటీఎస్ సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.