Cases resolved
-
593 కేసులు.. 215 తీర్పులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 593 కేసులపై విచారణ చేపట్టి, 215 కేసుల్లో తీర్పులు వెలువరించింది. కోవిడ్–19 వ్యాప్తి భయంతో లాక్డౌన్ కంటే రెండు రోజులు ముందుగానే మార్చి 23వ తేదీ నుంచి సుప్రీంకోర్టు ప్రాంగణం మూతబడిన విషయం తెలిసిందే. మామూలు సమయాల్లో నెలలో సుమారు 3,500 కేసులను విచారించే అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులను స్వీకరిస్తోంది. మొత్తం 16 ధర్మాసనాలకు గాను ప్రస్తుతం రెండు నుంచి మూడు ధర్మాసనాలే పనిచేస్తున్నాయి. అవి కూడా అత్యవసర కేసుల విచారణను మాత్రమే చేపడుతున్నాయి. ఈ ధర్మాసనాలు మార్చి 23– ఏప్రిల్ 24 తేదీల మధ్య 17 పనిదినాల్లో 593 కేసులను విచారించాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇందులో 84 రివ్యూ పిటిషన్లున్నాయని వివరించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో లాయర్ల ఆఫీసుల్లో మాత్రమే కనెక్టివిటీ సంబంధిత సమస్యలు కొన్ని తలెత్తాయని తెలిపింది. 2018–19 సంవత్సరంలో మొత్తం 34,653 కేసులపై విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు వార్షిక నివేదిక తెలిపింది. -
జాతీయ లోక్ అదాలత్లో 2,046 కే సుల పరిష్కారం
వరంగల్ లీగల్ : జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రతీ నెల రెండో శనివారం నిర్వహించే లోక్అదాలత్లో భాగంగా జిల్లాలోని కోర్టుల్లో 17 బెంచీలు ఏర్పాటుచేయగా వివిధ రకాల 2,046 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టు, మహబూబాబాద్ కోర్టుల్లో 23 సివిల్ కేసులు పరిష్కారం కాగా, జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 173 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఇంకా 1,740 విద్యుత్ సంబంధిత కేసులు రాజీ మార్గంలో పరిష్కరించగా, ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి 23 కేసుల్లో బాధితులకు రూ.54.36 లక్షలు చెల్లించేందుకు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. లోక్ ఆదాలత్లో జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మణ్, మొ దటి అదనపు జిల్లా జడ్జి కే.బీ.నర్సింహాలు, ఏడో అదనపు జిల్లా జడ్జి సాల్మన్రాజ్, సీనియర్ సివిల్ జడ్జి వరప్రసాద్, న్యాయాధికార సేవ సంస్థ కార్యదర్శి జడ్జి నీలిమతో పాటు ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యా యవాదులు పాల్గొన్నారు.