Cash Management
-
ఎయిర్‌పోర్టులో భారీ చోరీ.. పోలీసులు షాక్!
పారిస్: ఎయిర్‌పోర్టులో 3 లక్షల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.25 కోట్లు) డబ్బున్న రెండు సంచులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రధాన విమానాశ్రమంలో చోటుచేసుకుంది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ చోరీతో ఇంకా షాక్‌లోనే ఉన్నారు. దాదాపు యాభై ఏళ్లున్న ఓ వ్యక్తి పారిస్ లోని చార్లెస్ డి గాల్లే ఎయిర్‌పోర్టుకు గత శుక్రవారం వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో అటూఇటూ తిరుగుతున్న ఆ గుర్తుతెలియని వ్యక్తి లూమిస్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ గదుల వద్దకు వెళ్లగా.. రూమ్ ఓపెన్ చేసి ఉన్నట్లు గమనించాడు. క్షణాల్లో ఆ గదిలోకి వెళ్లిన ఆ వ్యక్తి కంపెనీ అక్కడ ఉంచిన రెండు సంచుల డబ్బును గుర్తించి.. చాకచక్యంగా వాటితో పరారయ్యాడు. లే పారిసియన్ అనే స్థానిక పత్రికలో పర్ఫెక్ట్ క్రైమ్ అంటూ కథనం రావడంతో విషయం వెలుగుచూసింది. ఆ సయంలో కంపెనీ రూము ఎందుకు తెరిచారో తెలియదు కానీ, ఆగంతకుడు మాత్రం ఎంతో అదృష్టవంతుడు.. అతడు రెండు వారాల ముందే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడంటూ ఆ కథనం సారాంశం. భారీ చోరీ ఎలా జరిగింది, లూమిస్ కంపెనీ సిబ్బంది హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పారిస్ పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినా నిందితుడి ఆచూకీ తెలియట్లేదని సమాచారం. యాభై ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులో సులువుగా 3 లక్షల యూరోలు కొట్టేశాడంటే పోలీసులకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదట. -
ఏటీఎంలలో రూ.57 లక్షల చోరీ
నెల్లూరులో సీఎంఎస్ కస్టోడియన్ల చేతివాటం నెల్లూరు (క్రైమ్): నగదు నిర్వహణ కస్టోడియన్లుగా పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులు నెల్లూరులోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో రూ.57,10,400 మాయం చేసినట్లు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల సమాచారం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీఎంఎస్ (క్యాష్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ) సంస్థ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే కాంట్రాక్టు తీసుకుంది. ఆ సంస్థలో నెల్లూరు సంతపేట తూకుమానుమిట్టకు చెందిన కె.రోహిత్‌కుమార్, బోగోలుకు చెందిన కె.మహేంద్ర నగదు కస్టోడియన్లుగా పనిచేస్తున్నారు. వారు నెల్లూరులో ఐవోబీ, ఐఎన్జీ వైశ్యాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు తదితర బ్యాంకులకు చెందిన 20 ఏటీఎంలలో రోజూ నగదు డిపాజిట్ చేసేవారు. ఆ ఏటీఎంలకు సంబంధించిన పాస్వర్డ్లు తెలిసిన నిందితులు కొంతకాలంగా 13 ఏటీఎంలలో నగదు కాజేయడం ప్రారంభించారు. గమనించిన మరో కస్టోడియన్ కిరణ్‌కుమార్ ఈనెల తొమ్మిదిన సంస్థ ఏరియా మేనేజర్ జె.రంజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రూ.57,10,400 అపహరణకు గురైనట్లు గుర్తించిన రంజిత్‌కుమార్ ఆదివారం ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.