కష్టాలు.. కన్నీళ్లే!
►రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల
►క్యూలైన్లలో సొమ్మసిల్లుతున్న వృద్ధులు
► పలు చోట్ల తొక్కిసలాటలు, ఆందోళనలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే అదీ తొలి వంద, రెండు వందల మంది ఖాతాదారులకే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు నగదు లేదంటూ ‘నో క్యాష్’ బోర్డులు పెడుతున్నారు. అటు గురువారం కూడా హైదరాబాద్‌లోని సుమారు 1,435 బ్యాంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మొత్తంగా ఉన్న ఏడువేల ఏటీఎంలలో గురువారం తెరుచుకున్నవి వెయ్యిలోపు మాత్రమే. ఎస్డీ రోడ్‌లోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యూలైన్లో నిలబడిన కృష్ణ సూర్యనారాయణ (65) అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను పోలీసులు వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఇక పలు చోట్ల బ్యాంకులు ఇచ్చే కొద్దిపాటి నగదు అయినా.. వారానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలతో కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మోండా మార్కెట్, చార్మినార్ తదితర మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
తొక్కిసలాటలు.. ఆందోళనలు..
నగదు కోసం బ్యాంకుల వద్దకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటుండడంతో తొక్కిసలాట, తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నగదు అందక జనం ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట భారీగా జనం చేరారు. ఉదయం 10.30కు బ్యాంకు గేటు తెరవడంతో.. వారంతా ఒక్కసారికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ రైతులు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నగదు ఇవ్వకుంటే తాము పంటలు ఎలా వేసుకోవాలంటూ బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్బీహెచ్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగదు లేదనడంతో రైతులు రాస్తారోకో చేశారు.
ఏటీఎంకు పూజలతో నిరసన
జనాలకు డబ్బులు అందజేయాల్సిన ఏటీఎంలు.. నోట్ల రద్దుతో ఎందుకూ పనికిరాని డబ్బాలుగా మారిపోయాయి. దీంతో జనం ఏటీఎంలకు పూజలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం కామారెడ్డిలోని పలు ఏటీఎంలకు పట్టణ కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ డబ్బులు పెట్టడం లేదని.. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కన్నయ్య పేర్కొన్నారు.
తిండీతిప్పలూ బ్యాంకు వద్దే..
అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కొండపాక, దుద్దెడ ఆంధ్రా బ్యాంకులకు వచ్చారు. రూ.4వేల చొప్పున ఇస్తామంటూ బ్యాంకు అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో నగదు ఇవ్వలేదు. దీంతో ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకు వద్దే నిరీక్షించారు. వారిలో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులు తిని కడుపు నింపుకున్నారు.
వృద్ధురాలికి ‘పెద్ద’ కష్టం
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు భాగ్యమ్మ (70). ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామం. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో గురువారం పింఛన్ సొమ్ము తీసుకుం దామని చెరువుమాధారం ఏపీజీవీ బ్యాంకుకు వచ్చింది. 2 గంట ల పాటు క్యూలో నిలబడడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఇది చూసిన మస్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే భాగ్యమ్మ తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితేమిటని వృద్ధురాలు కన్నీరమున్నీరవుతోంది.
క్యూలైన్లోనే బీడీలు చుడుతూ..
రోజూ బీడీలు చుడితేగానీ పూట గడవని పరిస్థితి వారిది. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. దీంతో అటు బ్యాంకుల ముందు క్యూలైన్లో ఉంటూనే.. ఇటు బీడీలూ చుడుతు న్నారు కొందరు మహిళలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆం ధ్రాబ్యాంకు ఎదుట గురువారం తెల్ల వారుజామున కనిపించిన దృశ్యమిది. పోత్గల్‌కు చెందిన ఈర్ల లక్ష్మి, ముస్తా బాద్‌కు చెందిన ఆరుట్ల లక్ష్మి, మరి కొందరు క్యూలైన్ల ఉండే బీడీలు చుడుతూ తమ వంతు కోసం ఎదురు చూశారు. గంటలు గంటలు నిలబడా ల్సి వస్తోందని, దాంతో పని పోతుం దనే ఉద్దేశంతో లైన్లోనే బీడీలు చుడుతున్నామని వారు పేర్కొన్నారు.
అమ్మా.. పాలకులను కదిలించేనా నీ కంటి చెమ్మ..
అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.. ఉన్నచోటి నుంచి కదలాలన్నా కష్టమైన పరిస్థితి.. అటు తిండికీ, ఇటు మందులకూ నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. కానీ ‘నోట్ల రద్దు’తో ఆ పింఛన్ సొమ్మునూ తీసుకోలేని పరిస్థితి.. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుకు వచ్చినా లైన్లో నిలబడలేక.. నిలబడినా సొమ్ము చేతికి అందక కన్నీళ్లే మిగులుతున్నాయి.. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చిన కమలమ్మ అనే వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. దుండిగల్ మండలం బౌరంపేట్‌కు చెందిన ఆమె.. అందరికన్నా ముందే బ్యాంకుకు వచ్చింది. కానీ నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తల బాదుకుంటూ, రోదిస్తూ ఇంటిదారి పట్టింది. ఇలా పింఛన్ సొమ్ము అందక ఎందరో పండుటాకులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. వాస్తవానికి తొలుత పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. తర్వాత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘నగదు’ సమస్యల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు కష్టాలు తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?.. పాత పద్ధతిలో నేరుగా పింఛన్ సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేయలేదా..?