నగదు స్వీకరణ మొత్తాన్ని పెంచాలి
కేంద్రాన్ని కోరిన ఏఐబీఈఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత రూ.500, రూ.1,000 నోట్లకు స్వస్తి పలికిన తర్వాత నగదు స్వీకరణ మొత్తాన్ని రూ.40,000లకు పెంచాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆర్బీఐని కోరింది. పాత నోట్లను తీసుకోవడం, కొత్తవి ఇవ్వడం అంత సులువైన పని కాదని, బ్యాంకు ఉద్యోగులు ఇందుకు సిద్ధంగా లేరని ఏఐబీఈఏ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాని బాకీల వసూలులో అన్ని బ్యాంకులు నిమగ్నమయ్యాయని చెప్పారు.
ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అరుుతే సరిపడ చిన్న నోట్లు కౌంటర్లలో లేవని చెప్పారు. నగదు సరఫరా కోసం ఆర్బీఐపై ఒత్తిడి ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పుడున్న రోజుకు రూ.10 వేలు లేదా వారం మొత్తంలో రూ.20 వేల నగదు స్వీకరణ పరిమితిని రూ.40 వేలకు పెంచాలన్నారు. యుద్ద ప్రాతిపదికన చిన్న నోట్ల సరఫరా పెంచాలని చెప్పారు.
సిద్ధమవుతున్న సిబ్బంది..
ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగులను నగదు మార్పిడి పనుల్లో ఉండే సిబ్బందికి సహాయకులుగా నియమిస్తామని ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ వెల్లడించారు. మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏటీఎం మెషీన్లలో నగదును నింపుతున్నట్టు చెప్పారు. ప్రసుత్త పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర బ్యాంకు అన్ని ఏర్పాట్లను చేస్తోందని ఆర్బీఐ హైదరాబాద్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి.క్రాంతి తెలిపారు. అదనపు పని గంటలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.