‘ఆ సమాచారం ఇస్తే రూ కోటి’
సాక్షి,న్యూఢిల్లీః బినామీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చే వారికి రూ కోటి వరకూ నజరానాలిచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. నగదు రివార్డులకు సంబంధించి వచ్చే నెలలో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ అధికారి ఈ విషయం వెల్లడించారు. బినామీ ఆస్తులపై సమాచారం ఇచ్చే వారికి కనిష్టంగా రూ 15 లక్షల నుంచి గరిష్టంగా రూ కోటి వరకూ నగదు రివార్డ్ అందించనున్నారు.
గత ఏడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఈ నిబంధన లేకున్నా ఆదాయ పన్ను శాఖ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి దర్యాప్తు సంస్థలు రివార్డులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నదేనని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫార్మర్ల సాయం తీసుకుంటే తమ పని మరింత సులువవుతుందని పన్ను అధికారులు భావిస్తున్న క్రమంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.