Cash For Tweet
-
టీడీపీ మైండ్‌గేమ్, 23న అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తోన్న ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై మానసిక దాడికి సిద్ధమవుతున్నారు. కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు నకిలీ ట్వీట్ల ద్వారా (క్యాష్ ఫర్ ట్వీట్) తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారని కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా ఇప్పుడు నేరుగా తెలంగాణ పోలీసులపై ఏపీ ప్రభుత్వ పెద్దలు మాటల దాడి మొదలెట్టారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) లోకేశ్ ట్వీట్ తమ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తోన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఫిబ్రవరి 23న ఆ కార్యాలయంలో పోలీసులు ఎందుకున్నార’ని ప్రశ్నిస్తూ.. సీసీటీవీ చిత్రాలను జతచేశారు. ఈ కేసు విషయంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారిపైనా టీడీపీ వర్గీయులు దాడి ప్రారంభించారు. ఆ అధికారి గతంలో కడపలో విధులు నిర్వహించినపుడు పోలీస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్‌మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు. వీటిని విపరీతంగా వైరల్ చేస్తూ తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మరకలంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఓ మంత్రి లేవనెత్తడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలు, విమర్శలను తెలంగాణ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం నేతల కామెంట్లను లైట్ తీసుకుంటున్నారు. తమ దర్యాప్తును దెబ్బతీసేందుకే ఇలాంటి విమర్శలుచేస్తున్నారని అంటున్నారు. (ఇదీ జరుగుతోంది!) 23న అసలేం జరిగింది? వాస్తవానికి తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు ఫిబ్రవరి 23న అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ సంస్థలోకి వెళ్లిన విషయం వాస్తవమే అని సైబరాబాద్ పోలీసులు అంగీకరిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా అసలు ఆ చిరునామాలో ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ఉందా లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు పోలీసులు 23న మధ్యాహ్నం 4.30 గంటలకు ఆ కంపెనీకి వెళ్లారు. అక్కడ అశోక్‌తోపాటు అతని సహోద్యోగులను కొన్ని ప్రశ్నలు అడిగారు. మీపై ఫిర్యాదు వచ్చిందని, మీరు 25న స్టేషన్‌కు రావాల్సి ఉంటుం దని మౌఖికంగా ఆదేశించారు. మరోసారి అశోక్‌కు ఫోన్‌చేద్దామని సాయంత్రం పోలీసులు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అయినా సోమవారం (25వతేదీ) వస్తాడులే అని పోలీసులు అనుకున్నారు. కానీ, జరిగింది వేరు. సేవామిత్రపై ఫిర్యాదు అందగానే.. అప్రమత్తమైన అశోక్ హార్డ్ డిస్కులతోపాటు ఏపీకి పరారయ్యాడు. అక్కడ నుంచి సేవామిత్ర యాప్ లో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి తిరిగి అప్లోడ్ చేయించాడు. -
చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్లో క్యాష్ ఫర్ ట్వీట్!
సాక్షి, హైదరాబాద్: డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా చంద్రబాబు, లోకేశ్.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.# TSGovtStealsData, # KTRStealsData అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తెలంగాణ ప్రభుత్వంపై వారిరువురి ఆదేశాల మేరకు ట్వీట్ల దాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.(డేటా స్కామ్‌పై మంత్రివర్గంలో మల్లగుల్లాలు) వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే, ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపేలా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తడం గమనార్హం. ముంబైకి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’ అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో.. ‘మా నాయకుడితో పోరాడలేకే.. మా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’.. అని ముంబైకి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చౌక్ పేరిట.. ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డేటాను దొంగిలిస్తున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలి’.. అనే అర్థం వచ్చేలా ట్వీట్ రాగా, రెండు రాష్ట్రాలతో సంబంధం లేని మరికొంత మంది కూడా ఇదే అర్ధం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. వీటిని గమనిస్తే కృత్రిమంగా ఒక ట్రెండ్‌ను సృష్టించి డేటా చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేలా చంద్రబాబు ఓ ప్రైవేటు ఏజెన్సీకి భారీగా డబ్బులు ముట్టచెప్పి ఈ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. దీనిపై ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. (సర్వం దోచేశారు)