కేసీఆర్ ను శంకించాల్సి వస్తోంది: పొంగులేటి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు ఎందుకు చేర్చలేదో ఏసీబీ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా వదిలేయడంతో సీఎం కేసీఆర్ను శంకించాల్సి వస్తోందన్నారు.
కేసును కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నట్టు ప్రజల్లో అనుమానాలున్నాయని చెప్పారు. చంద్రబాబు పాత్రపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏసీబీదేనని తేల్చి చెప్పారు. అదనపు ఛార్జిషీటులోనైనా చంద్రబాబు పేరు చేర్చకుంటే తెలంగాణ ప్రభుత్వం అభాసుపాలవుతుందని హెచ్చరించారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్నారు.