Cashier theft
-
ఎస్బీఐ క్యాషియర్ నిర్వాకం.. నకిలీ బంగారంతో రూ.60 లక్షలు స్వాహా
రామాపురం: నకిలీ బంగారం పెట్టి కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా చేశాడు ఎస్బీఐలో పని చేసే ఓ క్యాషియర్. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన రామాపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్బీఐ రామాపురం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు రవికుమార్. డబ్బు కాజేయాలనే దుర్బుద్ధితో ఓ ఎత్తుగడ వేశాడు. తనకు అనుకూలురైన సిబ్బందితో కథ నడిపాడు. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి తన కుటుంబసభ్యుల ఖాతాల ద్వారా లోన్ల పేరిట దాదాపు రూ.60 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఖాతాదారుల పేర్లతో కూడా డబ్బు స్వాహా చేసినట్లు తెలుస్తుండటంతో ఈ మొత్తం కోటి రూపాయలు దాటుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం అధికారులు ఈ విషయాన్ని గుర్తించి క్యాషియర్ రవికుమార్‌ను సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐబీఐ ఆర్ఎమ్ రామకృష్ణ, రామాపురం శాఖ మేనేజర్ నాగసుబ్రహ్మణ్యంలను వివరణ కోరగా నకిలీ బంగారంతో క్యాషియర్ రవికుమార్ డబ్బు తీసుకున్నమాట వాస్తవమేనని, అతడిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన నకిలీ బంగారంతో రుణాల పేరిట క్యాషియర్ రవికుమార్ భారీ మొత్తం స్వాహా చేసిన విషయం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు, బంగారం దాచుకునేందుకు జంకుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దాచుకున్న బంగారం విడిపించుకోవాలని ఖాతాదారులు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకున్నవారిని బ్యాంక్ అధికారులు వారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బంగారంపై పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెళ్లినా వారు స్పందించడం లేదు. చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు! -
Hyderabad: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. అయితే, వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అనంతరం హయత్ నగర్ కోర్టు.. ప్రవీణ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 30 వరకు ప్రవీణ్ రిమాండ్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయి. నేను ఎలాంటి మోసానికి పాల్పడలేదు. బ్యాంక్‌లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారు. అతి త్వరలో బయటకు వచ్చి బ్యాంక్ మోసాలను బయట పెడతాను. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి సాక్షాలతో నిరూపిస్తాను. బ్యాంక్‌లో లకర్స్‌కి పెట్టాల్సిన కెమెరాను కిందకు పెట్టారు’’ అని తెలిపాడు. జరిగింది ఇది.. నగరంలోని వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయానని.. మళ్లీ బెట్టింగ్‌లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్‌కు ప్రవీణ్ మొదట మెసేజ్ చేశారు. అనంతరం మాట మార్చి.. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియోను బయటకు వదిలాడు. ఆ వీడియోలో బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు. ఇది కూడా చదవండి: హైటెక్ దొంగ.. చోరీ చేసిన కార్లను.. -
దోంగ క్యాషియర్ అరెస్టు!
సాక్షి, కంచికచర్ల(నందిగామ): కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జి జి.శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ, విజయవాడకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు గత కొంతకాలంగా కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో బ్యాంకు మేనేజర్ కాకొల్లు యోగిత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించాడు. ఇద్దరి బాధ్యత కలిగిన క్యాష్ లావాదేవీలు, గోల్డ్‌లోన్స్ లావాదేవీల తాను ఒక్కడే నిర్వర్తించే విధంగా నమ్మించాడు. మేనేజర్ వద్ద ఉన్న తాళం కూడా తీసుకుని లాకర్లను ఓపెన్ చేసి పనులు చక్కబెడుతున్నాడు. మేనేజర్‌తో సంబంధం లేకుండా.. శ్రీనివాసరావు ఒకరోజు మేనేజర్‌కు తెలియకుండా లాకర్ నుంచి రూ.19లక్షలు, 3 గోల్డ్బ్యాగ్లు లాకర్లో నుంచి దొంగిలించాడు. తాకట్టు పెట్టిన ఒకరి బంగారు ఆభరణాలపై మరొకరి పేరుమీద లోన్ అకౌంట్ ఓపెన్ చేసి గోల్డ్‌లోన్ నగదు మొత్తం తీసుకున్నాడు. రెన్యువల్ కోసం ఖాతాదారుల వద్ద డెబిట్, క్రెడిట్ ఓచర్‌పై సంతకాలు తీసుకుని కొత్తఖాతాను తయారుచేసి పాత ఖాతాలో డబ్బులు చెల్లించకుండా ఆ సొమ్మును సొంతానికి, విలాసానికి వాడుకున్నాడు. బ్యాంకు మేనేజర్ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని లాకర్లోని బంగారాన్ని దొంగిలించి ఆ బంగారం నగలను ఆప్కాబ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ, నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని సొంతానికి ఉపయోగించుకున్నాడు. మేనేజర్ నిలదీయడంతో.. నగలు మయం కావడంతో విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావును నిలదీయగా నగదుతో పాటు బంగారం కూడా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను దొంగిలించిన సొత్తును, నగలను రెండురోజులలో తిరిగి బ్యాంకుకు అందజేస్తామని నమ్మబలికాడు. కాని నాటి నుంచి విధులకు రాకుండా శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. బ్యాంకులో జరిగిన విషయాల గురించి బ్యాంకు మేనేజర్ యోగిత బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంకు మేనేజర్ యోగితను ఇతర బ్యాంకుకు బదిలీచేశారు. క్యాష్ ఇన్చార్జి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. గల్లా ఓం ప్రకాష్‌ను బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరావుపై కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి రికవరీ..... నిందితుడు శ్రీనివాసరావు నుంచి నగదు రూ.20,75 లక్షలు, 2,200 గ్రాముల బంగారం నగలు, కారు రూ.6,25లక్షలు మొత్తం రూ.88లక్షలు రికవరీ చేసుకోవటం జరిగిందని తెలిపారు. శ్రీనివాసరావును అరెస్ట్‌చేసి నందిగామ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో నందిగామ డీఎస్పీ షేక్ అబ్దుల్ రజీజ్, సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, ఏఎస్ఐలు ఎంవీ కోటేశ్వరరావు, షేక్ జమీల్ పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు అందజేత నగదుతోపాటు బంగారు నగలు దొంగతనం కేసులో బ్యాంక్ క్యాష్ ఇన్చార్జి గొడవర్తి శ్రీనివాసరావును త్వరగా అరెస్టు చేయటం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం వచ్చిన జిల్లా ఎస్పీ, అనతికాలంలో బ్యాంకులో నగలు, నగదు దొంగతనానికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసినందుకు 8 మందికి రివార్డులు అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆలి, నాగరాజు, ప్రభాకర్, రఘు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కే రామారావు, హనుమంత్ ఉన్నారు. -
ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం
* ‘లయన్’ సినిమా ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ అపహరణ * దుండగులను పట్టుకున్న పోలీసులు హయత్‌నగర్: రామోజీ ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం... లయన్ సినిమా షూటింగ్ స్పాట్‌నుంచి దుండుగులు ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్‌ను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. బాధితులు, హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఫిలింసిటీలో బాలకృష్ణ నటిస్తున్న లయన్ షూటింగ్ జరుగుతోంది. సినిమా నిర్మిస్తున్న ఎస్ఎల్వీ కంపెనీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్‌కు చెందిన కార్లను అద్దెకు తీసుకుంది. గత డిసెంబర్ 31న వీటిలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పాడైపోయాయి. ఆ కార్లకు మరమ్మతు చేయించాలని, కార్ల అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫనా ట్రావెల్స్ నిర్వాహకులు జూబ్లీహిల్స్‌లోని ఎస్ఎల్వీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. దీంతో కార్లకు మరమ్మతులు చేయించి అద్దె చెల్లిస్తామని ఎస్ఎల్వీ కంపెనీ వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేరే కంపెనీ కార్లను అద్దెకు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఫనా ట్రావెల్స్‌కు చెందిన అక్బర్, ఇమ్రాన్‌ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ఖాన్లతో పాటు మరో ఇద్దరు రామోజీ ఫిలింసిటీలో లయన్ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్‌సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారు (ఏపీ09 సీసీ 1851)లో ఎక్కించుకుని నగరం వైపు బయలుదేరారు. అదే విధంగా మరో ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్ మహేష్‌ను కొట్టి అతని కారు పట్టుకెళ్లారు. క్యాషియర్ రాఘవచంద్రను తీసుకెళ్తున్న కారు హయత్‌నగర్‌లోని తొర్రూరు క్రాస్‌రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో రాఘవచంద్ర కారు దిగి పారిపోగా.. దిలీప్‌సింగ్ లోపలే కూర్చున్నాడు. అదే సమయంలో మరో ట్రావెల్స్‌కు చెందిన కారు డ్రైవర్ మహేష్ దుండగులను కారులో వెంబడిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, మహేష్ కలిసి వనస్థలిపురం పనామా వద్ద దుండగుల కారును అడ్డుకున్నారు. నిందితులను హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.