సాగర్‌లో విదేశీ విలాసం
నేటి నుంచి అందుబాటులోకి రానున్న ‘కాటమారన్ పాంటూన్ బోట్’
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పడవకు ముందువైపు ఒకే హల్లు (మొనదేలినట్టు ఉండే వంపు) ఉంటుంది. కానీ... ఈ పడవకు అలాంటివి రెండుంటాయి. వాటి మీద ప్లాట్‌ఫామ్. దానిపై ఖరీదైన సోఫాలు, ముచ్చొటగొలిపే అలంకరణ వస్త్రాలు, నాణ్యమైన సంగీత ఝరి... వెరసి అదో విలాసవంతమైన బోట్.. పేరు... ‘కాటమారన్ పాంటూన్’. అలలపై రివ్వున దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్లో షికారంటే పర్యాటకులకు ఎంతో మక్కువ. తాజాగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ దాదాపు రూ.22 లక్షలు వెచ్చించి ఈ విలాసవంతమైన పడవను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు దేశంలో మరే పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇలాంటి పడవలను ఉపయోగించటం లేదు. దీన్ని బుధవారం హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామిర్జా ప్రారంభించనున్నారు. 12 సీట్లుండే ఈ కొత్త బోటుపై విహారానికి ఒకరికి రూ.100 చొప్పున టికెట్ నిర్థరించారు. పుట్టినరోజు వంటి చిన్నచిన్న పార్టీలు కూడా ఇందులో జరుపుకొనే అవకాశం కల్పిస్తారు.
జాతీయ స్థాయి ప్రదర్శన...
కాగా, నగరంలో ఈ నెల 18 నుంచి 27 వరకు సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్ ఆధ్వర్యంలో మరో జాతీయ స్థాయి ప్రదర్శన నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు.