అవినీతి చీడ
తాడేపల్లిగూడెం : గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.1.85 లక్షలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ గునుపూడి రాజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన వ్యవహారం కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న అవినీతి వ్యవహారాన్ని ఈ ఘటన మరోసారి బట్టబయలు చేసింది. పట్టణ శివారు తాళ్లముదునూరుపాడుకు చెందిన వెలగల పట్టాభి రామిరెడ్డికి అతని వదిన 2013లో ఇచ్చిన గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజు రూ.1.85 లక్షలు డిమాండ్ చేయగా, పట్టాభిరావిురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ రాజుకు ఆ మొత్తం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రిజిస్ట్రార్ నుంచి రూ.1.85 లక్షలు, బడే సాహెబ్ అనే కమీషన్ ఏజెంట్ నుంచి నుంచి రూ.90 వేలు కలిపి రూ.2.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వేణుగోపాలరెడ్డి వెల్లడించారు.
అవినీతికి చిరునామాగా..
తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం అవినీతికి చిరునామాగా మారింది. పైరవీలు చేసినా ప్రోత్సహిం చేవారు, దోపిడీలో భాగస్వాములయ్యే వారికి ఇక్కడ కొదవ లేదు. తేడాలొస్తే సామాజిక వర్గం కార్డును ప్రయోగిస్తుంటారు. బినామీ రిజిస్ట్రేషన్లకు ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారింది. చివరకు చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను దస్తావేజులపై వేయించి రిజిస్ట్రేషన్లు చేయించే స్థాయికి ఇక్కడ అవినీతి ఎదిగిపోయింది. ఏసీబీ అయితే మాకేంటి, తేడాలొస్తే ఎవరిపైనైనా మేమే ఏసీబీ దాడి చేయించగలమంటూS ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు అవినీతి దందా నడిపిన ఘటనలు ఉన్నాయి. పై అధికారులకు సంతృప్తికర సేవలు అందించటం, వారి ఆశీస్సులతో అవినీతి వ్యవహారాలను చక్కబెట్టడం ఇక్కడ పనిచేసే వారి ప్రత్యేకత అనే అపప్రద ఉంది. అందువల్ల అవినీతి వ్యవహారాలు వెలుగుచూసినా, తదనంతర ఫలితాలు ఇక్కడ వారికి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం ఉంది.
మూడేళ్లలో రెండు దాడులు
2014 సెప్టెంబర్ 29న రాత్రి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వ్యక్తిని, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ సెలవు పెట్టిమరీ కార్యాలయంలో ఉన్న అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. భీమడోలు ప్రాంతంలోని 30 ఎకరాల భూముల రిజిస్ట్రేష¯ŒSకు సంబంధించి పెద్ద మొత్తంలో చేతులు సొమ్ములు మారాయని ఏసీబీకి అందిన పక్కా సమాచారం మేరకు ఆ రోజు ఏసీబీ అధికారులు దాడి చేశారు. రికార్డుల్లో నమోదు చేయని రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక్కడకు వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ గునుపూడి రాజు పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక పొలం వ్యవహారానికి సంబంధించి తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వ్యక్తి సబ్‌రిజిస్ట్రార్ అవినీతి వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ కార్యాలయంపై ఏసీబీ దాడి తప్పదనే ప్రచారం జరిగినా ఆ తర్వాత కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు అనిపించింది. శుక్రవారం గునుపూడి రాజు రూ.1.85 లక్షలను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే కార్యాలయంలో దళారిగా వ్యవహరిస్తున్న బడే సాహెబ్ అనే వ్యక్తి నుంచి రూ.90 వేలు స్వాధీనం చేసుకున్నారు.
అతడే చీడ
రెండక్షరాల పేరు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులపై ఆజమాయిషీ. అతడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారి అనుకునేరు. అతనికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అధికారికం గా ఎలాంటి సంబంధం లేదు. రికార్డు రూమ్ పర్యవేక్షణ నుంచి అవినీతి దందాల వరకు అతడే సేనాధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు ఏసీబీ దాడి జరిగినా ఆ వ్యక్తి మాత్రం లాఘవంగా తప్పించుకుంటాడు. ఇందులో కిటుకేమిటో ఎవరికీ తెలియదు. శుక్రవారం కూడా అదే జరిగింది.
ఆడిట్ అధికారులు వచ్చిన రెండు రోజుల్లోనే..
రెండు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలలో ఏం గుర్తించారనే విషయాలు తెలియలేదు గానీ.. రెండు రోజుల తర్వాత ఏసీబీ దాడి జరిగింది. 15 రోజుల పక్కా స్కెచ్‌తో సబ్ రిజిస్ట్రార్ బుక్ అయినట్టు ప్రచారం ఉంది.