సిరుల ‘ఫ్లవర్’
ఆత్మకూరు : ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు.. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన, మార్కెట్లో డిమాండ్ ఉన్న కాలీఫ్లవర్ సాగుపై మక్కువచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమ యం.. అధిక లాభాలు ఉండడంతో పంట విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పంటను మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కాలీఫ్లవర్ సాగు-పంటకు వచ్చే చీడపీడలు-నివారణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు వివరించారు.
చలికాలం చివరి వరకునాటుకోవచ్చు..
మెలకువలు పాటిస్తే కాలీఫ్లవర్‌లో అధికదిగుబడి సాధించవచ్చు. ఈ పంటను చలికాలం చివరివరకు నాటుకోవచ్చు. వేసవి తీవ్రత మొదలుకాకముందే పంట చేతికి వస్తుం ది. కాలీఫ్లవర్‌లో ముఖ్యంగా నల్లి, మచ్చతెగులు, ఆవాలరంపపు పురుగు, తొలుచు పురుగు, డైమండ్ బ్యాక్‌మాస్(మచ్చలు)తో పాటు కొరడా తెగులు, బ్రౌనింగ్, రైజీనెస్, పేనుబంక, బట్టరింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
చీడపీడలు-నివారణ
డైమండ్ బ్యాక్‌మాస్ : దీని లార్వాలు ఆకుల కణజాలాన్ని గీకి జల్లలాగా మారుస్తాయి. పెద్ద లార్వాలు ఆకుపై రంధ్రాలు చేస్తాయి. చెట్టు రంధ్రాలతో కనిపిస్తుంది. దీని నివారణకు ముందు గుడ్లను నాశనం చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 5శాతం వేపగింజల కశాయాన్ని పిచికారీ చేస్తే గుడ్లు కుళ్లిపోతాయి. మలాథియాన్ లేదా క్లోరో ఫైరిఫాస్ లీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
పేనుబంక : పేను బంక వారణకు లీటరునీటిలో ఒక మిల్లీలీటరు రోగోర్‌ను కలిపి పిచికారీ చేయాలి.
రైజీనెస్ : దీని లక్షణం పువ్వు వదులుగా ఉండడం. గడ్డమీద నూగు ఉంటుంది. దీంతో విలువ తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వులు వదులవుతాయి. దీని నివారణకు పూలను సమయానికి కోయాలి.
కొరడా తెగులు : ఆకులు పసుపు రంగుగా మారుతాయి. అంచులు తెల్లబడుతాయి. మధ్యభాగం ఈనె కొరడా లాగా బయటకు కనబడుతుంది. మాలిబ్డినమ్ లోపం వల్ల, నత్రజని ఎక్కువ కావడం వల్ల ఈతెగులు వస్తుంది. దీని నివారణకు సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఎకరానికి 400 గ్రాముల అమ్మోనియం మాలిబిడేట్‌ను 200లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.
బ్రౌనింగ్ : బోరాన్ లోపం వల్ల పువ్వుపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. పువ్వుపెరిగే దశలో లీటరు నీటిలో 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8కిలోల బోరాక్స్ వేయాలి.
బట్టరింగ్ : కాలీఫ్లవర్లు చిన్న పరిమాణంలో ఉండడాన్ని బట్టరింగ్ అంటారు. ముదిరిన నారు నాటడం వల్ల బట్టరింగ్ వస్తుంది. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా వేయొద్దు. తగిన మోతదులో ఎరువులు వేయాలి. సిపారసు చేసిన ఎరువులనే వాడాలి.
- సంజీవరావు(83744 49385),హార్టికల్చర్ ఆఫీసర్
నారు నర్సరీలో పోసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. నారు నర్సరీలో పోసుకోవాలి. 30రోజుల సమయం పడుతుంది. సాగు చేసిన తర్వాత సుమారు మూడునెలల్లో పంట చేతికి వస్తుంది. రెండున్నర నెలల్లో ఫ్లవర్ కోయడానికి 15రోజులు అనువుగా ఉంటుంది. ఈపదిహేను రోజుల్లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. అయితే హోల్‌సేల్‌గా అమ్మేదానికంటే రిటైల్‌గా అమ్ముకుంటేనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగుకు తేమలేకుండా ఉండే నేల అనుకూలం. మొక్కలు పెట్టేముందు భూమిని చదునుచేసుకోవాలి. తర్వాత సాళ్లు తీసి భూమిని తడిపి గడ్డిమందు పిచికారీ చేయా లి. తర్వాత మొక్కలు పెట్టాలి. ఎకరానికి 14వేల మొక్కలు పెట్టాలి. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. రూ.80వేల వరకు లాభం పొందవచ్చు.
- బిల్లా విష్ణువర్ధన్‌రెడ్డి(98667 06483), గుడెప్పాడ్
చీడపీడలు ఆశించకుండా చూసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. ఈ పంటకు ఎక్కువగా లద్దె పురుగు, పచ్చ పురుగులు ఆశిస్తాయి. ఇవి రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. నిరంతరం పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య పంటలకటే కాలీఫ్లవర్ సాగు చాలా లాభదాయకం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది.
- తీనేటి ఇంద్రారెడ్డి(97046 31975), గుడెప్పాడ్