Caved victims
-
బాధితులకు పరిహారం చెల్లించాలి
మర్రిగూడ(మునుగోడు): ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాకే చెర్లగూడెం రిజర్వాయర్ పనులు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. బాధితులను పట్టించుకోకుండా పోలీస్ పహారాలో రిజ ర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టడం దారుణమని అన్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో మంగళవారం ఎంపీ చెర్లగూడెం ముంపు బాధితులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బాధిత రైతులు అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని ఎంపీ భరోసా కల్పించారు. అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్లో లెవనెత్తి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మంచబోయే ప్రతి ప్రాజెక్టు కింద ముంపునకు గురై భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి 123 జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. ఆ జీఓను హైకోర్టు కొట్టివేసిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేను చూడలేదు.. ‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు’ అని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యేనే కాంట్రాక్టర్ వద్ద డబ్బులకు ఆశపడి పోలీసులతో రైతులను బెదిరించడం దారుణమన్నారు.కొంత మంది బ్రోకర్లను పెట్టుకుని ఎమ్మెల్యేనే దందాలకు తెగబడుతున్నాడని ఎంపీ ఆరోపించారు. కూసుకుంట్లకు సీఎం కేసీ ఆర్ వద్ద కూడా మంచి పేరు లేదని అన్నారు. ఇప్పటికైనా తీ రు మార్చుకోవాలని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఇన్చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి, ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ పాల్వాయి అనిల్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పొనుగోటి విజయరామారావు, మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మద్ది విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు పాముల యాదయ్య, కంచకంట్ల వసంతలక్ష్మీ, నాయకులు చిట్యాల రంగారెడ్డి, సిరపగ్రఢ అనందరావు, మల్గిరెడ్గి గోవర్ధన్‌రెడ్డి, రైతులు నేర్లకంటి రామలింగం, ఐతగోని వెంకటయ్య, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గింత విషం పోయండి
♦ మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆగ్రహం ♦ కడుపు మండి కొంతమంది నేతల ఇళ్లపై దాడులు.. విధ్వంసం ♦ గ్రామంలో యుద్ధ వాతావరణం పోలీసు పహారాలో కిష్టాపూర్ దుబ్బాక/తొగుట: ‘మల్లన్న సాగర్‌కు భూములివ్వొద్దని రాత్రింబవళ్లు ఇంటింటికీ తిరిగినం.. అయినోళ్లను, కానోళ్లను బతిమిలాడినం.. కాళ్లు మొక్కినం.. అయినా మార్పు రాలే.. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. కన్నతల్లిని వదులుకోలేక దుఃఖమొస్తోంది.. గుండె భారమవుతోంది.. కడుపు మండుతోంది.. చెట్టుకొక్కరు, పుట్టకొక్కరులా తమ బతుకులు తయారయ్యాయి. తమకింత విషం పోయండి..’ అంటూ కొమరవెళ్లి మల్లన్న సాగర్ ముంపు బాధితులు రోదించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ ఎంపీటీసీ దామరంచ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో సోమవారం కొంతమంది తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు తమ భూములను అప్పజెప్పారు. విషయాన్ని తెలుసుకున్న ఏటిగడ్డ కిష్టాపూర్, వేములాఘాట్ గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు, యువకులు గ్రామ సర్పంచ్ దాతారు సునంద నేతృత్వంలో తొగుట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని వినతిపత్రాన్ని తహసీల్దార్ దేశ్యా నాయక్‌కు అందించారు. అయితే పక్కనే ఉన్న ప్రతాప్‌రెడ్డి ముంపు బాధితులను చూసి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్లారు. ‘గ్రామస్తులంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా.. తమను చూసి కాలర్ ఎగరేస్తావా’ అంటూ వందలాది మంది ఆగ్రహంతో ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడున్న కారును ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుమలగిరిలోని వెల్దండ నర్సింహారెడ్డి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. నర్సింహారెడ్డి ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. నర్సింహారెడ్డి తండ్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు యత్నించగా, ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి నేవూరి జీవన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ధాన్యాన్ని బయట పారబోశారు. ఇంటి ముందు పల్సర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వంగ అంజాగౌడ్ ఇంటిపైకి దాడికి వెళ్లగా విషయాన్ని తెలుసుకున్న అంజాగౌడ్ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంతలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గౌడ్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి, గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించిన భూములను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతాప్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, అంజాగౌడ్, నర్సింహారెడ్డిలతో తమకు క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డితో డీఎస్పీ ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రాత్రి వరకు గ్రామ పంచాయతీ వద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాట తప్పారు గ్రామానికొచ్చి జిల్లా స్థాయి అధికారులు తమకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయి 15 రోజులవుతోంది. ఇంత వరకు ఏ ఒక్క అధికారి వచ్చి తమకు న్యాయం చేయలేదని, గుంట నక్కల్లా కొంతమందికి ఆశ చూపి భూములను అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై మండిపడ్డారు. ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితుల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విమర్శించారు. పోలీసు పహారాలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.