గింత విషం పోయండి | kistapur people fired on police | Sakshi
Sakshi News home page

గింత విషం పోయండి

Published Tue, May 31 2016 6:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

గింత విషం పోయండి

గింత విషం పోయండి

మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆగ్రహం
కడుపు మండి కొంతమంది నేతల ఇళ్లపై దాడులు.. విధ్వంసం
గ్రామంలో యుద్ధ వాతావరణం  పోలీసు పహారాలో కిష్టాపూర్

దుబ్బాక/తొగుట: ‘మల్లన్న సాగర్‌కు భూములివ్వొద్దని రాత్రింబవళ్లు ఇంటింటికీ తిరిగినం.. అయినోళ్లను, కానోళ్లను బతిమిలాడినం.. కాళ్లు మొక్కినం.. అయినా మార్పు రాలే.. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. కన్నతల్లిని వదులుకోలేక దుఃఖమొస్తోంది.. గుండె భారమవుతోంది.. కడుపు మండుతోంది.. చెట్టుకొక్కరు, పుట్టకొక్కరులా తమ బతుకులు తయారయ్యాయి. తమకింత విషం పోయండి..’ అంటూ కొమరవెళ్లి మల్లన్న సాగర్ ముంపు బాధితులు రోదించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ ఎంపీటీసీ దామరంచ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో సోమవారం కొంతమంది తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు తమ భూములను అప్పజెప్పారు.

విషయాన్ని తెలుసుకున్న ఏటిగడ్డ కిష్టాపూర్, వేములాఘాట్ గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు, యువకులు గ్రామ సర్పంచ్ దాతారు సునంద నేతృత్వంలో తొగుట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని వినతిపత్రాన్ని తహసీల్దార్ దేశ్యా నాయక్‌కు అందించారు. అయితే పక్కనే ఉన్న ప్రతాప్‌రెడ్డి ముంపు బాధితులను చూసి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్లారు. ‘గ్రామస్తులంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా.. తమను చూసి కాలర్ ఎగరేస్తావా’ అంటూ వందలాది మంది ఆగ్రహంతో ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడున్న కారును ధ్వంసం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుమలగిరిలోని వెల్దండ నర్సింహారెడ్డి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. నర్సింహారెడ్డి ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. నర్సింహారెడ్డి తండ్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు యత్నించగా, ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి నేవూరి జీవన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ధాన్యాన్ని బయట పారబోశారు. ఇంటి ముందు పల్సర్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

అనంతరం వంగ అంజాగౌడ్ ఇంటిపైకి దాడికి వెళ్లగా విషయాన్ని తెలుసుకున్న అంజాగౌడ్ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంతలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గౌడ్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి, గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించిన భూములను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతాప్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, అంజాగౌడ్, నర్సింహారెడ్డిలతో తమకు క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డితో డీఎస్పీ ఫోన్‌లో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రాత్రి వరకు గ్రామ పంచాయతీ వద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 అధికారులు మాట తప్పారు
గ్రామానికొచ్చి జిల్లా స్థాయి అధికారులు తమకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయి 15 రోజులవుతోంది. ఇంత వరకు ఏ ఒక్క అధికారి వచ్చి తమకు న్యాయం చేయలేదని, గుంట నక్కల్లా కొంతమందికి ఆశ చూపి భూములను అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై మండిపడ్డారు. ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితుల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

 పోలీసు పహారాలో ఏటిగడ్డ కిష్టాపూర్
గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement