వేటుకు వేళాయే!
►‘ఇందిరమ్మ’ అక్రమాలపై దర్యాప్తు పూర్తి
►1, 2 విడతల్లోనే భారీ అక్రమాలు నిర్ధారించిన సీఐడీ బృందాలు
►డీఎస్పీలతో ఐజీ చారుసిన్హా సమావేశం
►అనర్హుల ఎంపిక బాధ్యులపై చర్యలు
►అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు
సాక్షి, కరీంనగర్ : తీగలాగితే డొంక కదిలింది. రాజకీయ అండదండ.. అధికారంతో బలహీనవర్గాలకు చెందాల్సిన ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఇప్పటికే సీబీసీఐడీ బృందాలు జిల్లాలోని మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే. కరీంనగర్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో సీఐడీ డీఎస్పీల ఆధ్వర్యంలో బృందాలు విచారణ చేపట్టాయి. రికార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టని వాస్తవాలు చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి.
బిల్లుల మాయ, అభ్యర్థుల తారుమారులాంటి అక్రమాలెన్నో సీఐడీ దృష్టికి వచ్చాయి. ఇన్ని రోజుల విచారణలో తేలిన విషయాలు.. వెలుగుచూసిన అక్రమాలపై సీఐడీ ఐజీ చారుసిన్హా గురువారం హైదరాబాద్‌లో సీఐడీ డీఎస్పీలతో సమావేశమయ్యారు. విచారణపై సమీక్షిం చారు. ఈ సమీక్షలో జిల్లాలో సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసు, వైద్య, రైల్వేశాఖ సిబ్బంది, హాస్టల్ వార్డెన్లతోపాటు అవివాహితులకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రైనట్లు తేలిందని అధికారులు ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇందిరమ్మ 1, 2 విడతల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సీఐడీ బృందాలు నిగ్గు తేల్చాయి. అనర్హులను ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందితోపాటు పలు చోట్ల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే విచారణ నివేదికలను అధ్యయనం చేసిన ఐజీ చారుసిన్హా త్వరలోనే... తమ బృందా లు విచారణ చేపట్టిన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై ప్రభుత్వ కఠిన వైఖరి.. సీబీసీఐడీ దూకుడుతో అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులు అనర్హుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.