జయలలిత చెప్పినవన్నీ అబద్ధాలే
తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లి విషయంలో జయలలిత చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నారని, ఆమె పదవిలో ఉన్నప్పుడే ఇదంతా చేశారని న్యాయమూర్తి అన్నారు. దాదాపు 53 కోట్ల రూపాయల సంపద వెనకేసుకున్నా, ఆ సొమ్ము ఎలా వచ్చిందో మాత్రం వివరించలేకపోయారన్నారు. 1995లో చెన్నైలో జరిగిన సుధాకరన్ పెళ్లికి దాదాపు 40 వేల మంది అతిథులు వచ్చారు. వాళ్లందరికీ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు.
శుభలేఖల ప్రింటింగ్, కృతజ్ఞతా పూర్వక పత్రాలు, తాంబూలం, అతిథులకు విలువైన బహుమతులు.. వీటన్నింటికీ మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టారని, అతి తక్కువ ఖరీదు వేసుకున్నా కూడా ఈ మొత్తం వస్తోందని జడ్జి జాన్ మైఖేల్ డికున్హా అన్నారు. వీఐపీలు బసచేసిన హోటల్ బిల్లులన్నింటినీ జయలలితే చెల్లించారని అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ ఖర్చులను పెళ్లికూతురు కుటుంబం భరించినట్లు ఆమె చెప్పడం పూర్తిగా తప్పని, అవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు.