సీబీఐ చార్జిషీట్‌ను కొట్టేయండి
- హైకోర్టులో శ్రీనివాసన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో తనను నిందితునిగా చేరుస్తూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను, దీనిని విచారణకు తీసుకుంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు విచారించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా పిటిషనర్ గానీ, ఆయన కంపెనీ గానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని, ఈ విషయాన్ని గమనించకుండా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిందన్నారు. ఎలాంటి ఆధారాలను చూపకుండా కింది కోర్టు పిటిషనర్ అవినీతి నిరోధక చట్టం కింద నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక అభిప్రాయానికి రావడం సరికాదన్నారు. పిటిషనర్‌పై క్విడ్ ప్రో అభియోగాలు మోపిన సీబీఐ, అందుకు సంబంధించి చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని వివరించారు.