డీజేబీలో కుంభకోణం 21 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డులో అవకతవకలపై విచారణ జరుపుతున్న సీబీఐ గురువారం ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడాలలోని 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లకు మోటారు పంపులు, గేర్ బాక్సులు తదితర పరికరాల సరఫరాలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలొచ్చిన సంగతి విదితమే. ఈ ప్లాంట్లకు నాసిరకం పరికరాలను అత్యధిక ధరకు సరఫరా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీజేబీలోని యుటిలిటీ సర్వీసు విభాగంలోని ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఐదుగురు జూని యర్ ఇంజనీర్లపై ఐదు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యా యి.
ఈ అధికారులు ప్రయివేటు కంపెనీలతో కుమ్మక్కై చౌక ధరలకు లభించే నకిలీ విడిభాగాలను అధిక ధరలకు సరఫరా చేసి ప్రభుత్వాన్ని ఆరు కోట్ల రూపాయల మేర మోసగించారని సీబీఐ ఆరోపించింది. నకిలీ పత్రాలతో అధికారులు ప్రైవేటు కంపెనీని మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అధీకృత డీలర్‌గా చూపించారని సీబీఐ ఆరోపించింది. సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఉపయోగించే గేర్ బాక్సులు, మోటారు పంపులు, ఇతర విడిభాగాల విషయంలో మోసం జరిగిందని సీబీఐ ఆరోపించింది.కాగా మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లకు మోటారు పంపులు, గేర్ బాక్సులు తదితర పరికరాల సరఫరాలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలొచ్చిన సంగతి విదితమే.