సీసీఈపై అవగాహన కల్పించాలి
నెల్లూరు (టౌన్): నూతనంగా ప్రవేశపెట్టిన సీసీఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. సరస్వతీనగర్‌లోని మోడరన్ స్కూల్లో ఆదివారం జరిగిన నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్(నెపస్మా) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధనలో ఆలోచనలను మార్చుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేందుకు గానూ సీబీఎస్ఈ సిలబస్ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని సీసీఈ విధాన అమలుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫును కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చెముడుగుంటలో ఉన్న సైన్స్ సెంటర్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యత్నిస్తున్నామని వివరించారు.
నెపస్మా నూతన కార్యవర్గ ఏర్పాటు
2018 వరకు నెపస్మా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మైథిలీ మనోహర్‌రెడ్డి, కార్యదర్శిగా వెంకటరామయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. పరిశీలకులుగా పోతిరెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి వ్యవహరించారు.